వాకథాన్, ఉచిత మధుమేహ పాద పరీక్ష శిబిరం జెండా ఊపి ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం, మేజర్ న్యూస్:
ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎలిగెన్స్ డయాబెటిక్ ఫుట్ & అల్సర్ క్లినిక్, మధుర మీనాక్షి వాస్కులర్ & లింబ్ కేర్ క్లినిక్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఉదయం విజయనగరంలో మధుమేహ అవగాహన వాకథాన్ నిర్వహించారు. రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత మరియు సంబంధాల శాఖ మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ కోట జంక్షన్ వద్ద జెండా ఊపి వాకథాన్‌ను ప్రారంభించారు. సుమారు 250 నుండి 300 మంది ఈ వాకథాన్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
కోట జంక్షన్ నుండి బాలాజీ జంక్షన్ మీదుగా 100 అడుగుల రింగ్ రోడ్డులోని ఎలిగెన్స్ క్లినిక్ వరకు వాకథాన్ సాగింది. ప్రతిరోజూ నడక, క్రమం తప్పని షుగర్ పరీక్ష, రోజూ పాదాల పరిశీలన ప్రాముఖ్యతపై ఈ వాకథాన్ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించారు.
వాకథాన్ అనంతరం క్లినిక్‌లో ఉచిత మధుమేహ పాద పరీక్ష శిబిరాన్ని విజయనగరం ఎమ్మెల్యే శ్రీమతి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు ప్రారంభించారు. ప్లాస్టిక్ సర్జన్లు డాక్టర్ శ్రావణి ముద్దాడ, డాక్టర్ షిరిన్ పల్లి, వాస్కులర్ సర్జన్ డాక్టర్ భరత్ అరుణ్ మొంగం ఆధ్వర్యంలో సుమారు 50 మందికి షుగర్, బీపీ, పాదాల నరాలు మరియు రక్త ప్రసరణ పరీక్షలు చేశారు. పరీక్షించిన వారికి పాదాల సంరక్షణపై అవగాహన కల్పించి, అవసరమైన వారికి తదుపరి చికిత్సకు సూచనలు ఇచ్చారు.
ఈ ఏడాది ప్రపంచ మధుమేహ దినోత్సవ థీమ్ “మధుమేహంపై ముందుగానే చర్య”. అంతర్జాతీయ డయాబెటిస్ ఫెడరేషన్ (ఐడీఎఫ్) అంచనా ప్రకారం మన దేశంలో సుమారు 9 కోట్ల మంది పెద్దలు మధుమేహంతో బాధపడుతుండగా, వారిలో 43 శాతం మందికి తమకు ఈ వ్యాధి ఉన్నట్లు కూడా తెలియదు.
“మధుమేహం వల్ల పాదాల్లో స్పర్శ తగ్గుతుంది. దాంతో చిన్న గాయం కూడా తెలియకుండానే పుండుగా మారి, కాలు తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రతిరోజూ నడక, క్రమం తప్పకుండా షుగర్ పరీక్ష, రోజూ పాదాలను పరిశీలించుకోవడం ద్వారా దీనిని ముందుగానే నివారించవచ్చు” అని ఎలిగెన్స్ డయాబెటిక్ ఫుట్ & అల్సర్ క్లినిక్ సహ వ్యవస్థాపకురాలు, ప్లాస్టిక్, కాస్మెటిక్ & డయాబెటిక్ ఫుట్ సర్జన్ డాక్టర్ శ్రావణి ముద్దాడ తెలిపారు.
వాకథాన్‌ను ప్రారంభించిన మంత్రి గారికి, శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గారికి, సహకరించిన పోలీసు శాఖకు, వాలంటీర్లకు, పాల్గొన్న ప్రజలకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీనివాస్ బ్యూరో విజయనగరం