దసరా ఉత్సవాల్లో భక్తుల సౌకర్యానికే ప్రాధాన్యం: మంత్రి కొలుసు పార్థసారథి
ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: అమ్మవారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి సంతృప్తికరమైన దర్శనం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సమాచార, గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. శుక్రవారం మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్న అనంతరం ఇంద్రకీలాద్రి మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి కృపాకటాక్షాలతో ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. గతంలో మూలా నక్షత్రం రోజున అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులు క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉండి ఇబ్బందులు ఎదుర్కొనేవారని, ఈ నేపథ్యంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి దర్శన ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో దసరా మహోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేపట్టామని, క్యూ లైన్లు ఎంత పొడవుగా ఉన్నా భక్తులకు అవసరమైన సౌకర్యాలు, భద్రత కల్పించడమే ప్రాధాన్యమని స్పష్టం చేశారు. సామాన్య భక్తులు ఎలాంటి అసౌకర్యాలకు గురికాకుండా ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకుని సంతృప్తితో ఇళ్లకు తిరిగి వెళ్లేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రంలో పాడిపంటలు సమృద్ధిగా పండాలని, రైతుల కుటుంబాల్లో సిరిసంపదలు వెల్లివిరియాలని, యువతకు మెరుగైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలు విజయవంతం కావాలని, దేశాభివృద్ధికి కృషి చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. రాష్ట్రం, దేశం సర్వతోముఖాభివృద్ధి సాధించాలని, ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యాలు కలగాలని కోరుకున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాల సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్న విలేకరులకు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి కుటుంబాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ఆయురారోగ్యాలతో జీవించాలని మంత్రి ఆకాంక్షించారు.