డా.హసీమ్ బేగ్ పుట్టినరోజున సేవా స్ఫూర్తి.. - పేదల ఆకలి తీర్చుతూ పుట్టినరోజు వేడుకలు..
మచిలీపట్నం మేజర్ న్యూస్ : మచిలీపట్నం 16వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి, రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు డా. షేక్ హసీమ్ బేగ్ పుట్టినరోజు సందర్భంగా స్వేచ్ఛ ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ట్రస్ట్ నిర్వాహకులు షేక్ రఫీ, దుర్గా ప్రసాద్ పర్యవేక్షణలో మచిలీపట్నంలోని 14వ డివిజన్ ఎస్‌టీ కాలనీలో సుమారు 200 మంది నిరుపేదలకు అన్నదానం చేశారు. నిరుపేదల సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి మచిలీపట్నం మేయర్ పదవికి కూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థిని షేక్ అబ్దుల్ అబీదా, మాజీ మున్సిపల్ చైర్మన్ మొటమర్రి బాబాప్రసాద్, 14వ డివిజన్ కూటమి అభ్యర్థి తిరుమలశెట్టి నాగరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం అభినందనీయమని, నిరుపేదలకు అన్నదానం చేయడం ద్వారా సమాజానికి మంచి సందేశాన్ని అందించారని పేర్కొన్నారు. హసీమ్ బేగ్ భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ ప్రజలకు విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. అనంతరం మేయర్ అభ్యర్థిని షేక్ అబ్దుల్ అబీదా మాట్లాడుతూ, తనకు మేయర్ అభ్యర్థిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 28న జరిగే ఎన్నికల్లో తనతో పాటు నగరంలోని 60 డివిజన్లలో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతు ఇచ్చి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కూటమి అభ్యర్థులను గెలిపిస్తే మచిలీపట్నం నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో నగరంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు నగరంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ, హసీమ్ బేగ్ పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలతో కలిసి కేక్ కట్ చేసి, వారికి అన్నదానం చేయడం సంతోషంగా ఉందన్నారు. ట్రస్ట్ నిర్వాహకుడు షేక్ రఫీ మాట్లాడుతూ, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం, నిరుపేద కుటుంబాలకు భరోసా కల్పించడం, ముఖ్యంగా పిల్లల భవిష్యత్తుకు తోడ్పాటు అందించడం తమ ట్రస్ట్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. సమాజంలో సేవాభావాన్ని పెంపొందిస్తూ, అవసరమైన వారికి తమ వంతు సహాయం అందించేందుకు నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ఎస్‌టీ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మచిలీపట్నం, కృష్ణాజిల్లా.