చందవరం బౌద్ధ స్తూపానికి అంతర్జాతీయ ఖ్యాతి!
చందవరం బౌద్ధ స్తూపానికి
అంతర్జాతీయ ఖ్యాతి!
-పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ..
- ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి
- చందవరం చారిత్రక వైభవానికి పునరుజ్జీవం
- బౌద్ధ స్తూపం, శిల్పాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు
- డీపీఆర్ కోసం కన్సల్టెంట్ సంస్థతో పరిశీలన
- రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మల్లికార్జునతో కలిసి కలెక్టర్ పర్యటన
- ఏపీలో కనుగొన్న 150 స్తూపాల్లో చందవరం అతి పెద్దది: మల్లికార్జున
- చందవరం–త్రిపురాంతకం పర్యాటక సర్క్యూట్‌కు ప్రణాళిక
- గుండ్లకమ్మ నది.. ప్రాచీన మార్గంతో చందవరానికి ప్రత్యేక ప్రాధాన్యం
సూర్యప్రతినిధి, ఒంగోలు :
ప్రకాశం జిల్లాలోని చందవరం బౌద్ధ స్తూపానికి అంతర్జాతీయ పర్యాటక ప్రాధాన్యత తీసుకువచ్చేలా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు తెలిపారు. చందవరం బౌద్ధ స్తూపాన్ని సమగ్ర పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్ది దేశ, విదేశాల నుంచి పర్యాటకులు, బౌద్ధ మత పరిశోధకులు వచ్చేలా మౌలిక వసతులు కల్పించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.మంగళవారం రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మల్లికార్జున, ప్రముఖ వైద్యురాలు, టీడీపీ దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మితో కలిసి కలెక్టర్ రాజాబాబు చందవరం బౌద్ధ స్తూపాన్ని సందర్శించారు. స్తూపాన్ని ఆసక్తిగా పరిశీలించిన అధికారులు, చారిత్రక కట్టడాలు, అక్కడి శిల్పాలను పరిశీలించారు. స్తూపం ప్రాంగణం మొత్తం కలియతిరిగి స్థానికులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు.
అంతర్జాతీయ టూరిస్టులను ఆకర్షించేలా అభివృద్ధి
ఈ సందర్భంగా కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ.. చందవరం బౌద్ధ స్తూపానికి దేశవ్యాప్తంగా ప్రత్యేక చారిత్రక ప్రాధాన్యత ఉందన్నారు. ఈ చారిత్రక వైభవాన్ని పరిరక్షిస్తూ భావితరాలకు అందించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు.చందవరం ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్తూపం వద్ద ఉన్న పురాతన శిల్పాలను భద్రపరిచేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని చెప్పారు.బౌద్ధ చరిత్ర, సంస్కృతి, వారసత్వంపై విశేష అధ్యయనం చేసిన రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మల్లికార్జునతో కలిసి ప్రాంతాన్ని పరిశీలించడం వల్ల అభివృద్ధి ప్రణాళికకు మరింత స్పష్టత వస్తుందని కలెక్టర్ తెలిపారు.
డీపీఆర్ కోసం కన్సల్టెంట్ సంస్థతో పరిశీలన
చందవరం బౌద్ధ క్షేత్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే అంశంపై సమగ్ర ప్రణాళిక రూపొందించేందుకు డీపీఆర్ సిద్ధం చేసే కన్సల్టెంట్ సంస్థ ప్రతినిధులను కూడా వెంట తీసుకువచ్చినట్లు కలెక్టర్ వెల్లడించారు.పర్యాటకుల సౌకర్యాలు, చారిత్రక కట్టడాల పరిరక్షణ, శిల్పాల భద్రత, ప్రాంత అభివృద్ధి వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు.
ఏపీలోని 150 స్తూపాల్లో చందవరమే పెద్దది
సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ.. క్రీస్తుపూర్వం రెండో శతాబ్దం నుంచి క్రీస్తుశకం రెండో శతాబ్దం మధ్యకాలంలో చందవరం ప్రాంతం ఎంతో గొప్ప స్థితిలో ఉన్నట్లు వివరించారు.ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు కనుగొన్న సుమారు 150 బౌద్ధ స్తూపాల్లో చందవరం స్తూపం అతిపెద్దదని తెలిపారు. ప్రాచీన కాలంలో కాశీ నుంచి కాంచీపురం మధ్య ఉన్న ప్రధాన మార్గానికి సమీపంలో ఈ ప్రాంతం ఉండటం, పక్కనే గుండ్లకమ్మ నది ప్రవహించడం వల్ల చందవరానికి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడిందన్నారు.
విదేశీ పరిశోధకులను ఆకర్షించిన చారిత్రక ప్రదేశం
చందవరం బౌద్ధ స్తూపంపై విదేశాల నుంచి కూడా పలువురు వచ్చి బౌద్ధ మతానికి సంబంధించిన పరిశోధనలు చేసినట్లు మల్లికార్జున తెలిపారు. ఈ చారిత్రక నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకుని చందవరం ప్రాంతాన్ని మరింత విస్తృతంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.చందవరంతో పాటు సమీపంలోని ప్రసిద్ధ త్రిపురాంతకం ఆలయాన్ని కూడా కలుపుతూ ప్రత్యేక పర్యాటక సర్క్యూట్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
చారిత్రక వైభవంతో పాటు పర్యాటక అభివృద్ధి
గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ.. చందవరం ప్రాంతానికి ఉన్న చారిత్రక, సాంస్కృతిక ప్రత్యేకతను కాపాడుకుంటూనే పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా చర్యలు తీసుకుంటున్న కలెక్టర్ రాజాబాబు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మల్లికార్జునకు కృతజ్ఞతలు తెలిపారు.చందవరం బౌద్ధ స్తూపానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి అభివృద్ధి చర్యలు చేపడితే స్థానికంగా పర్యాటక రంగంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉందన్నారు.
అధికారుల సమక్షంలో క్షేత్రస్థాయి పరిశీలన
ఈ పర్యటనలో పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ సురేష్, అసిస్టెంట్ డైరెక్టర్ జరీనా బేగం, పర్యాటక శాఖ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ జయదేవ్, ఆర్డీవో విజయ జ్యోతి కుమారి, డీపీవో అనుపమ, ఏపీ సీపీడీసీఎల్ ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, భూగర్భ జలవనరుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావుతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.