పోలవరం జిల్లా పోర్టల్ లో...అరకు వివరాలు!
కొత్త జిల్లా పోర్టల్‌లో.. అరకు కథ!
పోలవరం అధికారిక వెబ్‌సైట్‌లో కొండంత నిర్లక్ష్యం
పోలవరం జిల్లా అధికారిక పోర్టల్‌లో స్థానిక వివరాలు రాయాల్సింది పోయి.. అరకు, అనంతగిరి కొండలు, కాఫీ తోటలు, బాక్సైట్ గనుల సమాచారాన్ని కాపీ-పేస్ట్ చేసేశారు! పోలవరానికి జిల్లా హోదా వచ్చినా, వెబ్‌సైట్‌లో మాత్రం ఇంకా *‘తూర్పుగోదావరి జిల్లాలోని ఓ పల్లెటూరు’*గానే చూపిస్తున్నారు. గోదావరి వరదలు, ముంపు వంటి అత్యవసర పరిస్థితుల్లో అధికారిక సమాచారం కోసం పోర్టల్‌ను ఆశ్రయించే ప్రజలను గందరగోళానికి గురిచేసే పరిస్థితి ఇది. సర్కారు వెబ్‌సైట్‌లో ఇంతటి తప్పులు కనిపిస్తున్నా సరిదిద్దకపోవడం అధికారుల నిర్లక్ష్యాన్ని బయటపెడుతోంది.»
ఉమ్మడి గోదావరి జిల్లాల సూర్య బ్యూరో
(రంపచోడవరం)
కొత్తగా ఏర్పాటైన పోలవరం జిల్లా అధికారిక వెబ్‌సైట్ బాధ్యతారాహిత్యానికి నిదర్శనంగా మారింది. పోర్టల్‌లోని ‘అబౌట్ డిస్ట్రిక్ట్’ విభాగాన్ని తెరిస్తే.. పోలవరం వివరాలకు బదులుగా అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచారం దర్శనమిస్తోంది. సముద్ర మట్టానికి 1,300 మీటర్ల ఎత్తు, అనంతగిరి, సుంకరిమెట్ట, కాఫీ తోటలు, బాక్సైట్ నిక్షేపాలు అంటూ కొండ ప్రాంత విశేషాలను తీసుకొచ్చి గుడ్డిగా అతికించేశారు.
అంతటితో ఆగలేదు. అదే పేజీలో “Polavaram is a village and Mandal in East Godavari district” అని రాసి ఉంది. కొత్త జిల్లా ఏర్పాటైన తర్వాత కూడా పోలవరాన్ని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఒక గ్రామంగానే చూపించడం అధికారిక సమాచార నిర్వహణలో వైఫల్యాన్ని బయటపెడుతోంది.
గోదావరి వరదలు, ప్రాజెక్టు ముంపు సమస్యలతో ముడిపడిన ఈ ప్రాంతంలో విపత్తు హెచ్చరికలు, ఆర్‌అండ్‌ఆర్ పునరావాసం, అత్యవసర సహాయ సమాచారం కోసం ప్రజలు అధికారిక పోర్టల్‌ను ఆశ్రయిస్తారు. అలాంటి కీలక వేదికలోనే తప్పుడు వివరాలు ఉండటం గందరగోళానికి దారితీస్తోంది. జిల్లా కలెక్టరేట్, ఎన్‌ఐసీ అధికారులు వెంటనే స్పందించి తప్పుడు వివరాలను తొలగించి, పోలవరం జిల్లాకు సంబంధించిన పూర్తి, సరైన సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.