తీరంలో అలజడి..మన్యంలో వాగుల ఉదృతి
తీరంలో అలజడి.. మన్యంలో వాగుల ఉద్ధృతి!
కాకినాడను భారీ వర్షాలు, ఈదురుగాలుల ముప్పు వెంటాడుతుంటే.. పోలవరం ఏజెన్సీలో పొంగుతున్న కొండవాగులు
లోతట్టు ప్రాంతాల నుంచి ఘాట్ రోడ్ల వరకు నిఘా
రంగంలోకి ఇరు జిల్లాల యంత్రాంగం.. అత్యవసర బృందాలు సిద్ధం
ఉమ్మడి గోదావరి జిల్లాల సూర్య బ్యూరో
(కాకినాడ)
తీరం దాటినా తీవ్ర వాయుగుండం ప్రభావం ఉమ్మడి తూర్పుగోదావరి ప్రాంతాన్ని వదలడం లేదు. ఓ వైపు కాకినాడ తీరాన్ని భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు తాకుతుండగా.. మరోవైపు పోలవరం జిల్లా ఏజెన్సీలో కొండవాగులు ఉప్పొంగుతున్నాయి. గురువారం ఉదయం నుంచి వాతావరణం మరింత ప్రతికూలంగా మారడంతో ఇరు జిల్లాల యంత్రాంగాలు రంగంలోకి దిగాయి. కాకినాడలో సముద్ర తీరం నుంచి లోతట్టు ప్రాంతాల వరకు నిఘా పెంచగా.. రంపచోడవరం కేంద్రంగా మన్యంలోని వాగులు, ఘాట్ రోడ్లు, మారుమూల గిరిజన గ్రామాలపై అధికారులు దృష్టి పెట్టారు.
కాకినాడ తీరమంతా నిఘా
కాకినాడ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లకుండా మత్స్యశాఖ, మెరైన్ పోలీసులు తీరం వెంబడి గస్తీ కొనసాగిస్తున్నారు. కాకినాడ పోర్టులో మూడో నంబరు హెచ్చరిక కొనసాగుతోంది. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ను అందుబాటులో ఉంచారు.
కాకినాడ నగరంలోనూ వర్షపు నీరు నిలిచిన ప్రాంతాల్లో మోటార్లు, పంపులతో నీటిని బయటకు పంపుతున్నారు. జగన్నాథపురం సహా లోతట్టు ప్రాంతాల్లో మున్సిపల్ యంత్రాంగం క్షేత్రస్థాయిలో తిరుగుతూ ఎక్కడికక్కడ పరిస్థితికి అనుగుణంగా చర్యలు చేపడుతోంది.
మన్యంలో వాగులే ముప్పు
పోలవరం జిల్లాలో పరిస్థితి మరోలా ఉంది. రంపచోడవరం, మారేడుమిల్లి, దేవీపట్నం వైపు ఎడతెరిపి లేని వర్షాలతో కొండవాగుల్లో ప్రవాహాలు పెరుగుతున్నాయి. రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని మారుమూల గిరిజన గ్రామాలకు రాకపోకలు దెబ్బతినకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గ్రామాల్లో నిత్యావసరాలు, అత్యవసర మందుల అందుబాటుపైనా దృష్టి పెట్టారు.
ఘాట్ రోడ్లలో కొండచరియలు విరిగిపడటం, చెట్లు నేలకొరగడం, వాగుల ప్రవాహం రహదారులపైకి వచ్చే ప్రమాదం ఉండటంతో ప్రయాణికులు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మారేడుమిల్లి సహా ఏజెన్సీ ప్రాంతాల్లో వర్ష తీవ్రతను బట్టి రాకపోకలపై ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునేందుకు సంబంధిత శాఖలను సిద్ధంగా ఉంచారు.
అత్యవసరమైతే తప్ప ప్రయాణం వద్దు
తీరంలో సముద్రపు అలజడి.. మన్యంలో ఉప్పొంగుతున్న వాగులు.. మధ్యలో ఎడతెరిపిలేని వర్షం. ఈ పరిస్థితుల్లో ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. పొంగుతున్న వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని, విద్యుత్ స్తంభాలు, తెగిపడిన వైర్లకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. కాకినాడ తీరం నుంచి పోలవరం మన్యం వరకు వాన ముప్పు కొనసాగుతుండటంతో ఇరు జిల్లాల యంత్రాంగాలు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉన్నాయి.