గ్రూప్ టాప్‌గా సెమీస్‌లోకి దూసుకెళ్లిన భారత పురుషుల కబడ్డీ జట్టు!
సూర్య స్పోర్ట్స్ డెస్క్: ఆసియా క్రీడలు 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత పురుషుల కబడ్డీ జట్టు పతకం దిశగా మరో అడుగు ముందుకు వేసింది. నాగోయా వేదికగా గురువారం జరిగిన గ్రూప్-ఎ చివరి మ్యాచ్‌లో ఛైనీస్ తైపీపై 37–21 తేడాతో ఘన విజయం సాధించి, గ్రూప్ టాపర్‌గా సెమీఫైనల్స్‌కు చేరుకుంది. దీంతో భారత్‌కు కనీసం కాంస్య పతకం ఖాయమైంది.
మొదటి నుంచీ పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించిన భారత జట్టు ప్రథమార్ధం ముగిసేసరికి 23–11 పాయింట్ల ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్ధంలోనూ అదే జోరును కొనసాగించి 14–10 పాయింట్లతో మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ రైడింగ్ ద్వారా 28 పాయింట్లు, మూడు బోనస్ పాయింట్లు మరియు ప్రత్యర్థి జట్టును ఆల్ అవుట్ చేయడం ద్వారా ఆరు పాయింట్లు సాధించింది. ఈ టోర్నీ గ్రూప్ దశలో దక్షిణ కొరియా, జపాన్, బంగ్లాదేశ్‌లను వరుసగా ఓడించిన భారత్‌కు ఇది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం.
1990లో ఆసియా క్రీడల్లో కబడ్డీ చేరినప్పటి నుంచి భారత పురుషుల జట్టు ఎనిమిది స్వర్ణాలు సహా మొత్తం తొమ్మిది పతకాలు సాధించి తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. మరోవైపు, భారత మహిళల కబడ్డీ జట్టు కూడా గ్రూప్ దశలో బంగ్లాదేశ్, ఇరాన్‌లపై వరుస విజయాలు సాధించి సెమీస్ రేసులో ముందంజలో ఉంది.