యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర బస్సు ప్రమాదం
సంతాపం తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము!
సూర్య జాతీయ డెస్క్: ఉత్తర ప్రదేశ్‌లోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణీకులతో వెళ్తున్న స్లీపర్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. గురువారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించిన రాష్ట్రపతి, ఈ దుర్ఘటనలో పలువురు మృతి చెందారనే వార్త తీవ్ర వేదనకు గురిచేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తన తీవ్ర సానుభూతిని తెలిపిన ఆమె, ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థించారు.
ఢిల్లీ నుంచి బీహార్ వైపు వెళ్తున్న స్లీపర్ బస్సు గురువారం తెల్లవారుజామున గ్రేటర్ నోయిడా పరిధిలోని జేవార్ పోలీస్ స్టేషన్ పరిధి, 33వ మైలురాయి వద్దకు చేరుకోగానే ఈ విషాదకర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తక్షణమే స్పందించి, మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, బాధితుల కుటుంబాలకు తగిన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను సీఎమ్‌వో ఆదేశించింది.