ఏపీ, తెలంగాణలో ఫ్లాష్‌ఫ్లడ్ హెచ్చరికలు
*ఉత్తరాంధ్ర జిల్లాలకు ఆకస్మిక వరద ముప్పు.. తెలంగాణలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం అప్రమత్తం
అమరావతి/హైదరాబాద్: తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో పలు జిల్లాలకు ఆకస్మిక వరదల (ఫ్లాష్‌ఫ్లడ్) హెచ్చరికలు జారీ అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు, వాగులు, వంకల పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్‌లో అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఆకస్మిక వరదల ముప్పు ఉన్నట్లు హెచ్చరికలు వెలువడ్డాయి. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ అధికారులు సూచించారు.
తెలంగాణలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు కూడా ఫ్లాష్‌ఫ్లడ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో ఆకస్మికంగా వరదనీరు చేరే అవకాశం ఉండటంతో అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
తీవ్ర వాయుగుండం కళింగపట్నం సమీపంలో తీరం దాటిన నేపథ్యంలో మరో 24 నుంచి 48 గంటల పాటు వర్షాల ప్రభావం కొనసాగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని, వాగులు, వంకలు, వరదనీటి ప్రవాహాలను దాటేందుకు ప్రయత్నించవద్దని సూచించారు.