భారత్ - కరికోమ్ దేశాల విదేశాంగ మంత్రుల భేటీ
ద్వైపాక్షిక సహకారంపై కీలక చర్చలు!
సూర్య అంతర్జాతీయ డెస్క్: న్యూయార్క్‌లో జరుగుతున్న 81వ ఐక్యరాజ్యసమితి సాధారణ సభ (యుఎన్‌జీఏ) సమావేశాల సందర్భంగా భారత్ మరియు కరేబియన్ సమాజం (కరికోమ్) విదేశాంగ మంత్రుల స్థాయి సమావేశం బుధవారం ఘనంగా జరిగింది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్, సురినామ్ విదేశాంగ మంత్రి మెల్విన్ డబ్ల్యూ.జె. బౌవా ఉమ్మడిగా ఈ సమావేశానికి నాయకత్వం వహించారు. 2024 నవంబర్‌లో గయానాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, కరికోమ్ దేశాల నాయకుల మధ్య జరిగిన రెండో ఇండియా-కరికోమ్ శిఖరాగ్ర సదస్సు స్పూర్తితో ఈ భేటీ కొనసాగింది. బార్బడోస్, డొమినికా, బహామాస్, గయానా, జమైకా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, హైతీ, సెంట్ లూసియా, ఆంటిగ్వా అండ్ బార్బుడాతో సహా పలు కరికోమ్ సభ్యదేశాల విదేశాంగ మంత్రులు, సీఈఓలు మరియు కరికోమ్ సెక్రటరీ జనరల్ డాక్టర్ కార్లా నథాలీ బార్నెట్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ భేటీలో భారత్ - కరికోమ్ దేశాల మధ్య రాజకీయ అనుబంధాన్ని బలోపేతం చేసుకోవడం, వర్తక వాణిజ్యాలు మరియు పెట్టుబడులను గణనీయంగా పెంచడంపై ప్రధానంగా చర్చించారు. వ్యవసాయం, ఆహార భద్రత, డిజిటల్ గవర్నెన్స్, వాతావరణ స్థితిస్థాపకత మరియు ఇంధన రంగాలలో సహకారాన్ని మరింత విస్తరించాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి. కరేబియన్ ప్రాంతంలో భారత్ అందిస్తున్న అభివృద్ధి భాగస్వామ్యాన్ని, గ్లోబల్ సౌత్ దేశాల మధ్య పరస్పర సహకారానికి భారత్ ఇస్తున్న ప్రాధాన్యతను కరికోమ్ నాయకులు కొనియాడారు. ఐక్యరాజ్యసమితి సంస్కరణలు, వాతావరణ మార్పులపై పోరాటం, ఉగ్రవాద నిర్మూలన మరియు సరిహద్దు నేరాల అదుపు వంటి అంతర్జాతీయ అంశాలపై కలసికట్టుగా ముందుకు సాగాలని నిశ్చయించారు.
ఈ సమావేశంలో అత్యంత కీలక పరిణామంగా 2028-29 కాలవ్యవధికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యుఎన్‌ఎస్‌సీ) తాత్కాలిక సభ్యత్వానికి పోటీ పడుతున్న భారతదేశ అభ్యర్థిత్వానికి కరికోమ్ దేశాలు తమ పూర్తీ మద్దతును ప్రకటించాయి. తమపై ఉంచిన నమ్మకానికి, అందిస్తున్న మద్దతుకు కరికోమ్ సభ్యదేశాలకు కృతజ్ఞతలు తెలిపిన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్, గయానా మరియు ఇతర కరేబియన్ భాగస్వాములకు గ్లోబల్ సౌత్ యొక్క బలమైన గొంతుకగా భారతదేశం ఎల్లప్పుడూ నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ప్రాంతీయ, అంతర్జాతీయ మరియు ద్వైపాక్షిక అంశాలలో సంబంధాలను మరింత ముమ్మరం చేసేందుకు ఈ సమావేశం దోహదపడింది.