ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణ సంస్కరణలు చేపట్టాలి
ఐరాస వేదికగా జీ4 దేశాల ఉమ్మడి డిమాండ్!
సూర్య అంతర్జాతీయ డెస్క్: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యుఎన్‌ఎస్‌సీ) ప్రస్తుత నిర్మాణం సమకాలీన ప్రపంచ రాజకీయ వాస్తవాలను ప్రతిబింబించడం లేదని, అందువల్ల భద్రతా మండలిలో తక్షణమే సమగ్ర సంస్కరణలు చేపట్టాలని జీ4 కూటమి దేశాలైన భారత్, బ్రెజిల్, జర్మనీ, జపాన్ విదేశాంగ మంత్రులు స్పష్టం చేశారు. న్యూయార్క్‌లో జరుగుతున్న 81వ ఐరాస సాధారణ సభ (యుఎన్‌జీఏ) సమావేశాల సందర్భంగా భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్, బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వియెరా, జర్మనీ మంత్రి డాక్టర్ జోహాన్ డేవిడ్ వాడేఫుల్, జపాన్ విదేశాంగ మంత్రి మోతెగి తోషిమిత్సు సమావేశమై ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. ఎనిమిది దశాబ్దాల నాటి పాత నిర్మాణంతో పనిచేస్తున్న భద్రతా మండలి, అంతర్జాతీయ శాంతి భద్రతల పరిరక్షణలో తన ప్రాథమిక బాధ్యతను సమర్థవంతంగా నెరవేర్చలేకపోతోందని మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు.
భద్రతా మండలి సభ్యత్వ విస్తరణ ప్రాసెస్ లో శాశ్వత, తాత్కాలిక అనే రెండు విభాగాలలోనూ సభ్య సంఖ్యను పెంచడమే సంస్కరణల ప్రక్రియకు ప్రాథమిక మూలస్తంభంగా ఉండాలని మంత్రులు పునరుద్ఘాటించారు. ముఖ్యంగా ఆఫ్రికా, ఆసియా-పసిఫిక్, లాటిన్ అమెరికా మరియు కరేబియన్ ప్రాంతాలకు సరైన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. భద్రతా మండలి సంస్కరణలపై ఇంటర్‌గవర్నమెంటల్ నెగోషియేషన్స్ (ఐజిఎన్) ఫ్రేమ్‌వర్క్ పరిధిలో 18 ఏళ్లుగా చర్చలు జరుగుతున్నప్పటికీ ఎలాంటి స్పష్టమైన ఫలితాలు రాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సంస్కరణల కోసం టెక్స్ట్-బేస్డ్ చర్చలు ప్రారంభించడమే తమ ప్రధాన ప్రాధాన్యత అని ప్రకటించిన జీ4 మంత్రులు, సాధారణ సభతో సహా ఇతర వేదికలలో కూడా ఇతర భాగస్వామ్య దేశాలతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. తదుపరి సమీక్షా సమావేశాన్ని నవంబర్ లేదా రాబోయే రోజుల్లో న్యూఢిల్లీలో డైరెక్టర్ జనరల్ స్థాయిలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.