భారీ వర్షాలు.. విద్యా సంస్థలు బంద్
*భారీ వర్షాలు.... విద్యాసంస్థలు బంద్*
---విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన కలెక్టర్
----వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డా. సత్య శారద కీలక నిర్ణయం.
----అంగన్వాడీల నుండి డిగ్రీ కాలేజీల వరకు సెలవు.
వరంగల్ ప్రతినిధి, సెప్టెంబర్ 24: (మేజర్ న్యూస్ సూర్య)
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వరంగల్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించడంతో, విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద కీలక నిర్ణయం తీసుకున్నారు.జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు గురువారం (సెప్టెంబర్ 24) సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతో పాటు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలకు, అంగన్వాడీ కేంద్రాలకు కూడా ఈ సెలవు వర్తిస్తుందని స్పష్టం చేశారు.
*ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్*
భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు వెళ్లవద్దని, ముఖ్యంగా వర్షాలు, వరదలు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని కోరారు. జిల్లాలో వర్ష పరిస్థితులను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, ప్రజల భద్రతకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
*కంట్రోల్ రూమ్ ఏర్పాటు:*
ప్రజల సౌకర్యార్థం జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 24 గంటల పాటు పనిచేసే *టోల్ ఫ్రీ నంబర్లు - 1800 425 3424, 91542 52936* లకు ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే వెంటనే కాల్ చేసి సమాచారం ఇవ్వాలని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.