కళింగపట్నం సమీపంలో తీరం దాటిన తీవ్ర వాయుగుండం
*ఉత్తరాంధ్రలో కుండపోత.. 50–70 కి.మీ. వేగంతో ఈదురుగాలులు.. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు
విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తరాంధ్ర తీరాన్ని దాటింది. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో బుధవారం అర్ధరాత్రి వాయుగుండం తీరం దాటినట్లు అధికారులు వెల్లడించారు. తీరం దాటే ప్రక్రియ సుమారు మూడు గంటలపాటు కొనసాగినట్లు సమాచారం.
వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని అధికారులు సూచించారు.
విశాఖపట్నం నగరంపై వాయుగుండం తీవ్ర ప్రభావం చూపింది. ఏకధాటిగా కురిసిన వర్షాలతో పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కొనసాగుతున్నాయి.
విజయనగరం జిల్లాలోనూ భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. పలు రహదారులు నీట మునిగాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగిపొర్లే పరిస్థితి నెలకొంది.
శ్రీకాకుళం జిల్లాలో రాత్రంతా వర్షం, ఈదురుగాలుల ప్రభావం కొనసాగింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. వాయుగుండం భూభాగంలోకి ప్రవేశించినప్పటికీ దాని ప్రభావంతో మరికొన్ని గంటలపాటు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది.
ప్రస్తుతం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.