టెక్కలి సమీపంలో ఘోర రైలు ప్రమాదం రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ ఢీకొని నలుగురు యువకులు మృతి
టెక్కలి మేజర్ న్యూస్:23
శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస జంక్షన్ సమీపంలోని బమ్మిడివారి కోనేరు వద్ద బుధవారం విషాదకర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొనడంతో నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడటంతో అతడిని టెక్కలి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
స్థానికుల సమాచారం ప్రకారం.. మృతులు టెక్కలి మండలం డమర గ్రామానికి చెందిన యువకులుగా గుర్తించారు. వీరంతా టెక్కలిలోని వసతి గృహంలో ఉంటూ ఇంటర్ చదువుతున్నట్లు సమాచారం. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు బయటకు వచ్చిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
రావివలస జంక్షన్ సమీపంలోని బమ్మిడివారి కోనేరు వైపు వెళ్లిన యువకులు రైల్వే పట్టాలు దాటుతుండగా నౌపడ–గుణుపూర్ వైపు వెళ్తున్న రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ వారిని ఢీకొట్టినట్లు ప్రాథమిక సమాచారం. ఈ ఘటనలో నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోగా, సాల్మన్ రాజు అనే యువకుడు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
ఘటనా స్థలానికి అధికారులు
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, డీఎస్పీ లక్ష్మణరావు, సీఐ విజయ్‌కుమార్ తదితర అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై వివరాలు సేకరించారు. జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డి కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని, అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
*డమరలో విషాదఛాయలు*
ఒకే గ్రామానికి చెందిన నలుగురు యువకులు రైలు ప్రమాదంలో మృతి చెందడంతో డమర గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. తమ పిల్లలను కోల్పోయిన కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కలచివేశాయి.
యువకులు కోనేరు వద్దకు ఎందుకు వెళ్లారనే విషయంపై స్థానికంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చేపలు పట్టేందుకు వెళ్లారని కొందరు, ఇతర అవసరాల కోసం వెళ్లారని మరికొందరు చెబుతున్నారు. అయితే వారు రైల్వే పట్టాల వద్దకు వెళ్లడానికి గల పూర్తి కారణాలు అధికారుల విచారణలో తేలాల్సి ఉంది.
*మంత్రుల దిగ్భ్రాంత*
రైలు ఢీకొని నలుగురు మృతిపై మంత్రి దిగ్భ్రాంతి
ఘటనపై ఆరా తీసిన మంత్రి అచ్చెన్నాయుడు
రావివలస వద్ద జరిగిన రైలు ప్రమాద ఘటనపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనపై అధికారులను ఫోన్‌లో సంప్రదించి వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన యువకుడికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు కూడా ఘటనపై స్పందించి దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రమాదానికి దారితీసిన కారణాలపై రైల్వే, రెవెన్యూ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు.