ఆత్మకూరు అభివృద్ధికి మరో రూ.29 కోట్లు- రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
ఆత్మకూరు అభివృద్ధికి మరో రూ.29 కోట్లు
ఆత్మకూరు, మేజర్ న్యూస్:
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ కేంద్రంగా వర్చువల్ విధానంలో రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల పరిధిలో సుమారు రూ.12 వేల కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఆత్మకూరు మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.29 కోట్ల నిధులు కేటాయించారు.
ఆత్మకూరులో జరిగిన వర్చువల్ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొని, ముఖ్యమంత్రి గారి కార్యక్రమాన్ని ప్రజలతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు మున్సిపాలిటీ అభివృద్ధికి సంబంధించిన పైలాన్‌ను ఆవిష్కరించడం కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆత్మకూరు అభివృద్ధి ప్రస్థానంలో పైలాన్ ఆవిష్కరణ ఒక విశేషమైన, శుభప్రదమైన ఘట్టంగా నిలిచింది.
ఇప్పటికే ఆత్మకూరు అభివృద్ధికి వందల కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. తాజాగా మంజూరైన రూ.29 కోట్లు కూడా వాటికి అదనంగా అందుతున్నాయని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌కు ముందు, అనంతరం కూడా మరిన్ని నిధులు తీసుకువచ్చి ఆత్మకూరు మున్సిపాలిటీని అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.
అనంతరం కూటమి ముఖ్య నాయకులతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు మున్సిపాలిటీకి మంజూరైన రూ.29 కోట్ల నిధులు మున్సిపాలిటీలోని అన్ని వార్డులకు సమానంగా అభివృద్ధి కార్యక్రమాలు అందే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. అలాగే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూటమి నాయకులందరూ ఐక్యంగా పనిచేయాలని, గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా సమష్టిగా పనిచేసి విజయం సాధించామో, అదే స్ఫూర్తితో మున్సిపల్ ఎన్నికల్లో కూడా అందరి సహకారం, సమన్వయంతో ముందుకు సాగి విజయాన్ని సాధించేలా కృషి చేయాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నాయకులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, మాజీ కౌన్సిలర్లు, అధికారులు, మేధావులు, యువత, కార్మికులు, మహిళలు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆత్మకూరు అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.