పెంచలకోనలో రెండో రోజు శ్రీవారికి పవిత్రాల సమర్పణ
పెంచలకోనలో రెండో రోజు శ్రీవారికి పవిత్రాల సమర్పణ
నెల్లూరు కల్చరల్ / రాపూరు మేజర్ న్యూస్
నెల్లూరు జిల్లా, రాపూరు మండలం పెంచలకోనలో వార్షిక పవిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం రెండవ రోజు కార్యక్రమాలను ఆలయ అర్చకులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
రెండవ రోజు ఉదయం వేద, దివ్య ప్రబంధ పారాయణలతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అనంతరం ఆలయంలో ద్వార తోరణ, ధ్వజ కుంభారాధన, మహా కుంభారాధన, చక్రజ్జమండల ఆరాధన తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు. అగ్ని ప్రతిష్ఠ, విశేష హోమాదులు, స్నపన తిరుమంజనం, ప్రాయశ్చిత్త హోమం నిర్వహించిన అనంతరం శ్రీ స్వామివార్లకు పవిత్రాలను సమర్పించారు.
సాయంత్రం వేళ తిరిగి వేద, దివ్య ప్రబంధ పారాయణలు, విశేష హోమం కన్నుల పండువగా జరిగాయి. అనంతరం శ్రీ ఉభయ దేవేరులతో కూడిన నృసింహ స్వామి వారి ఉత్సవ మూర్తులను తిరుచ్చి పల్లకిపై వేంచేపు చేసి విశేష క్షేత్రోత్సవాన్ని నిర్వహించారు. ప్రధానార్చకులు, అర్చకులు, వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ పల్లకి సేవ అత్యంత వైభవంగా జరిగింది.ఈ వార్షిక పవిత్రోత్సవాల ఏర్పాట్లను, ఉత్సవ కార్యక్రమాలను ఆలయ ఉపకమీషనర్, కార్యనిర్వహణాధికారి కోవూరు జనార్థన్ రెడ్డి పర్యవేక్షించారు.