BREAKING
శ్రీకాళహస్తీశ్వరాలయంలో హీరోయిన్ డింపుల్ హయాతి ప్రత్యేక పూజలు.. వీడియో వైరల్! ఓటీటీలోకి మృణాల్ ఠాకూర్ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్.. పూజా మేరీ జాన్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే? బాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు ముస్తాక్ ఖాన్ కన్నుమూత! ఆత్మవిశ్వాసమే ఆయుధంగా... అంతర్జాతీయ వేదికపై 'సోముదేవుపల్లి' కుర్రాడి అద్భుతం! నాని ‘ది ప్యారడైజ్’ తొలిరోజు బాక్సాఫీస్ కలెక్షన్లు.. రికార్డు స్థాయిలో వసూళ్లు! పర్యాటక, ఆతిథ్య రంగాల కోసం యాక్సిస్ బ్యాంక్ సరికొత్త ప్రచారం: దేశవ్యాప్తంగా 5,000 మందికి పైగా వ్యాపారులతో అనుసంధానం జమ్మూకశ్మీర్ పారిశ్రామిక విధానం 2026-35 ముసాయిదాపై సీఎం ఒమర్ అబ్దుల్లా సమీక్ష: స్థానిక ఉపాధి, పెట్టుబడులే లక్ష్యం క్రమశిక్షణ, ప్రణాళికతో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలి ఆర్నభ్ తుఫాను బీభత్సంతో నీటమునిగిన మధురవాడ ప్రాంతాలు అవినీతి, కులతత్వం, వారసత్వ రాజకీయాలకు స్వస్తి: పనితీరు ఆధారిత రాజకీయాలను మోదీ ప్రభుత్వం తెచ్చింది.. అమిత్ షా వాడపల్లి వెంకన్న హుండీ ఆదాయం రూ 2.50 కోట్లు భీమిలి తీరంలో గుర్తుతెలియని మగ శిశువు మృతదేహం పెంచలకోనలో రెండో రోజు శ్రీవారికి పవిత్రాల సమర్పణ గెడ్డలు మింగేశారు.. నగరాన్ని ముంచేశారు! వైఎస్సార్సీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీల సేవలుఅమోఘం.మేకపాటి రాజగోపాల్ రెడ్డి

గెడ్డలు మింగేశారు.. నగరాన్ని ముంచేశారు!

Select Suryaa Now
గెడ్డలు మింగేశారు.. నగరాన్ని ముంచేశారు!

 

కుప్పకూలిన డ్రైనేజీ వ్యవస్థ.. కాగితాలకే పరిమితమైన పూడికతీత!

కబ్జాల కోరల్లో సహజ మార్గాలు.. ముంపు గుప్పిట్లో గాజువాక కాలనీలు!

ఈ ఏడాదే వర్షాల్లేవు.. ఈ రెండు రోజులకే మునిగితే, ఇక ఆగకుండా కురిస్తే పరిస్థితి ఏంటి?

రోడ్లపై నడుము లోతు నీరు.. నెత్తిన షార్ట్ సర్క్యూట్ నిప్పురవ్వల నడుమ రాకపోకలు!

అధికారుల నిర్లక్ష్యంపై రగులుతున్న పారిశ్రామిక నగరం!

గాజువాక, సెప్టెంబర్ 24, మేజర్ న్యూస్ : ఆకాశానికి చిల్లు పడిందా.. లేక దశాబ్దాలుగా సాగుతున్న కబ్జాదారుల పాపం, అధికారుల అవినీతి పండిందా? అసలే ఈ ఏడాది పెద్దగా వర్షాలే లేవు.. అలాంటిది కేవలం ఈ రెండు మూడు రోజులు కురిసిన వర్షానికే పారిశ్రామిక నగరమైన గాజువాక అష్టదిగ్బంధంలో చిక్కుకుంటోంది. ఎగువ ప్రాంతాల నుంచి ఉవ్వెత్తున దూసుకొచ్చే వరద నీరు తీరానికి చేరాల్సిన సహజ మార్గాలన్నీ మూసుకుపోవడంతో ఊళ్లకు ఊళ్లే చెరువులుగా మారిపోయాయి. గాజువాక, పెదగంట్యాడ మండలాల్లోని కుంచుమాంబ కాలనీ, నాతయ్యపాలెం, హౌసింగ్ బోర్డు కాలనీ, షీలానగర్, హరిజన జగ్గయ్యపాలెం ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయాయి. ముఖ్యంగా గంగవరం ప్రధాన రహదారిపై నడుము లోతు నీరు నిలిచి రాకపోకలు స్తంభించగా, చీకట్లో పైన విద్యుత్ వైర్లు షార్ట్ సర్క్యూట్ అవుతూ నిప్పురవ్వలు ఎగిసిపడటంతో వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వచ్చింది. అర్ధరాత్రి వేళ ఇళ్లలోకి మురుగు, వరద నీరు ముంచెత్తడంతో వేలాది కుటుంబాలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నాయి. నిత్యావసర సరుకులు, పరుపులు, ఎలక్ట్రానిక్ వస్తువులు బురద నీటిలో కలిసిపోయాయి. వరద ప్రవాహంలో పాములు, తేళ్లు ఇళ్లలోకి చొరబడుతుండటంతో మహిళలు, చిన్నారులు ప్రాణభయంతో వణికిపోతున్నారు. నాతయ్యపాలెంలో చెరువు నిండిపోవడంతో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. కొన్నిచోట్ల కొండవాలు ప్రాంతాల్లో మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి. హౌసింగ్ బోర్డు కాలనీ నరకకూపంగా మారి నీరు బయటకు పోయే దారి లేక రెండు రోజులుగా నిలిచిపోతుండటం అధికారుల ఘోర వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.

కుప్పకూలిన డ్రైనేజీ వ్యవస్థ.. కాగితాలకే పరిమితమైన పూడికతీత!

​ఈ ముంపునకు అసలు మూలకారణం.. గాజువాకలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలడమే! నగరం ఇంత వేగంగా విస్తరిస్తున్నా, దానికి తగినట్లుగా పటిష్టమైన భూగర్భ మురుగు కాలువలు, పెద్ద వరద కాలువలను నిర్మించడంలో అటు పాలకులు, ఇటు జీవీఎంసీ ఇంజినీరింగ్ అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. ఏటా వర్షాలకు కాలనీలు మునుగుతున్నాయని తెలిసినా ప్రజాప్రతినిధులు శాశ్వత పరిష్కారం చూపకపోవడం, అధికారులు అలసత్వం ప్రదర్శించడంతో సమస్య మొదటికే వస్తోంది. కొండల నుంచి ఉధృతంగా వచ్చే భారీ ప్రవాహాన్ని తట్టుకునేలా సరైన ప్రధాన కాలువల వ్యవస్థను ఏనాడూ పట్టించుకోలేదు. కాలనీల్లో నిర్మించిన ఇరుకైన చిన్న కాలువలు ఆ ప్రవాహాన్ని తట్టుకోలేక, మురుగు నీరంతా రోడ్లు, ఇళ్లపైకే పొంగిపొర్లుతోంది. దీనికితోడు ఏటా వర్షాకాలానికి ముందే కాలువల్లో పూడికతీత పనుల పేరిట లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని కాగితాలపైనే ఖర్చు చూపిస్తున్నారే తప్ప, క్షేత్రస్థాయిలో పూడికను, పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించిన దాఖలాలు లేవు. చిన్నపాటి వర్షం పడినా కాలువలు పొంగి ఇళ్లలోకి రావడం అధికారుల కమీషన్ల కక్కుర్తికి నిదర్శనం కాదా అని స్థానికులు నిలదీస్తున్నారు. ముంపు ముంచెత్తాక కాలువల్లోని చెత్తను హడావుడిగా తీసి చేతులు దులుపుకోవడం కాదని, వర్షపు నీరంతా ఎక్కడా ఆగకుండా సాఫీగా వెళ్లిపోయేలా శాశ్వత ప్రాతిపదికన పెద్ద కాలువలను నిర్మించాలని ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.


​సహజ గెడ్డలను మింగేసిన అక్రమార్కులు!

​డ్రైనేజీ లోపాలకుతోడు దశాబ్దాలుగా ప్రకృతి ప్రసాదించిన సహజసిద్ధమైన గెడ్డలు, వాగులు, చెరువులను రియల్ ఎస్టేట్ మాఫియా, బడా వ్యాపారులు మింగేస్తుంటే రెవెన్యూ, జీవీఎంసీ అధికారుల ఉదాసీనత ప్రజల పాలిట శాపంగా మారింది. ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న గెడ్డలు, చెరువుల పోరంబోకు స్థలాలను కంటికి రెప్పలా కాపాడాల్సిన రెవెన్యూ యంత్రాంగం.. కళ్లెదుటే అక్రమాలు జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా గాజువాకలోనే గెడ్డలు, వాగులు, చెరువుల వంటి నీటి వనరుల కబ్జాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఒకప్పుడు విశాలంగా ఉండి, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద ప్రవాహాన్ని తీరప్రాంతం వైపు తీసుకెళ్లే సహజ మార్గాలను అడ్డగోలుగా ఆక్రమించి భారీ భవనాలు, వాణిజ్య సముదాయాలు, ప్రైవేటు పరిశ్రమల ప్రహరీ గోడలు నిర్మించేశారు. గెడ్డలను, వాగులను పూడ్చేసి ప్లాట్లు వేస్తుంటే అడ్డుకోవాల్సిన రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారులు చూసీచూడనట్లు వదిలేశారు. వరద నీరు పల్లానికి వెళ్లే మార్గాలు మూసుకుపోవడంతో ఆ ప్రవాహమంతా నగరవాసుల ఇళ్లను ముంచెత్తుతోంది. అసలే వర్షాలు లేని ఈ ఏడాదిలోనే కేవలం ఈ రెండు మూడు రోజుల వర్షానికే గాజువాక ఈ స్థాయిలో అతలాకుతలమైతే, రేపు ఏదైనా తుపాను వచ్చి ఆగకుండా భారీ వర్షాలు కురిస్తే అసలు గాజువాక ఆనవాళ్లు మిగులుతాయా? నగరమే మునిగిపోదా? అని ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

​కంటితుడుపు నాటకాలు చాలు.. శాశ్వత పరిష్కారం చూపాలి!

ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, పాలకులు కుంభకర్ణ నిద్ర వీడాలి. వరద వచ్చిన ప్రతిసారీ హడావుడి చేసి, ఆ తర్వాత గాలికొదిలేసే తాత్కాలిక చర్యలకు ఇకనైనా స్వస్తి పలకాలి. ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న సహజ గెడ్డలు, చెరువుల స్థలాల్లో వెలసిన అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపాలి. ఎలాంటి రాజకీయ పైరవీలకు తావులేకుండా కబ్జాలను తొలగించి, సహజ ప్రవాహ మార్గాలను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలి. కాలనీల నుంచి వచ్చే వర్షపు నీరంతా నిరాటంకంగా బయటకు వెళ్లిపోయేలా పటిష్టమైన ప్రధాన కాలువల వ్యవస్థను శాశ్వతంగా నిర్మించాలి. పన్నులు వసూలు చేయడంలో చూపించే శ్రద్ధ.. కనీస సమస్యల పరిష్కారంలో చూపించకపోతే, పాలకులు, అధికారుల ఉదాసీనతపై ప్రజాగ్రహం వెల్లువెత్తడం ఖాయం!