ఆత్మవిశ్వాసమే ఆయుధంగా... అంతర్జాతీయ వేదికపై 'సోముదేవుపల్లి' కుర్రాడి అద్భుతం!
అమెరికా వరల్డ్ కప్ లో టీమ్ ఇండియాకు ప్రాతినిధ్యం... చైనాలో రజత పతకం
నేటి నుంచి తమిళనాట జరిగే నేషనల్ పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమైన గణేష్
ఎస్.రాయవరం, సెప్టెంబర్ 24, మేజర్ న్యూస్ :
అంగవైకల్యం శాపం కాదు... పట్టుదల ఉంటే అదే వరం అవుతుందని నిరూపించాడు ఎస్.రాయవరం మండలం సోముదేవుపల్లికి చెందిన యువకుడు అన్నం గణేష్. తనకున్న అవిటితనాన్ని అధిగమించి, ఆత్మవిశ్వాసంతో అంతర్జాతీయ పారా వాలీబాల్ క్రీడాకారుడిగా ఎదిగాడు.
క్రీడాకారుడు గణేష్ పుట్టుకతోనే కుడి కాలుకి పోలియో సోకింది. అతని తల్లి,తండ్రులు మణి, అర్జునరావు వ్యవసాయకూలీలు. ప్రాథమిక, ఉన్నత విద్య ప్రభుత్వ పాఠశాలలో పూర్తి చేసి, ఇంటర్ ప్రెవేట్ కళాశాలలో, డిగ్రీ, పీజీ ఎలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పూర్తి చేశారు. చిన్ననాటి నుంచి గణేష్ కి ఆటలపై మక్కువ ఎక్కువ కావడంతో చిన్నప్పటి నుండే వాలీబాల్, క్రికెట్, కబడ్డీ ఆటలు ఇష్టంగా ఆడేవారు. ఎలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతూ వాలీబాల్ పై ప్రత్యేక దృష్టి పెట్టాడు. ఆర్థిక ఇబ్బందులు, శారీరక లోపం.. ఏదీ అతని లక్ష్యాన్ని అడ్డుకోలేకపోయాయి.
లక్షలు అప్పు చేసి మరీ చైనా పోటీలకెళ్లి రజక పతకం తెచ్చి...
2024 లో చైనాలో జరిగిన పోటీలకు 3 లక్షల రూపాయలు అప్పు చేసి వెళ్లి రజత పతకం తెచ్చుకున్నాడు. కజకిస్తాన్ టూర్ ను ఆర్థిక ఇబ్బందులతో వదులుకున్నాడు. తర్వాత గణేష్ మరింత పట్టుదలతో సాధన చేసి ఏకంగా అమెరికా వరల్డ్ కప్ వరకు వెళ్లాడు.
గణేష్ సాధించిన విజయ పతకాల పరంపర....
అమెరికాలో ప్రపంచ వేదికపై భారత్ కు ప్రాతినిధ్యం: 2025 అక్టోబర్ 12 నుంచి 18 వరకు అమెరికాలోని ఫోర్ట్ వేన్ లో జరిగిన వరల్డ్ పారా వాలీ వరల్డ్ కప్ లో టీమ్ ఇండియా తరపున ఆడాడు.
రజత పతకం: 28 మే నుండి 2 జూన్ 2024 వరకు చైనాలోని చోంగ్‌కింగ్ లో జరిగిన వరల్డ్ పారా బీచ్ వాలీ వరల్డ్ ఛాంపియన్‌షిప్ లో రజత పతకం కైవసం చేసుకున్నాడు.
జాతీయ స్థాయిలో బంగారం 14వ సీనియర్ నేషనల్ పారా సిట్టింగ్ వాలీబాల్ ఛాంపియన్‌షిప్ (మీరట్) లో ఆంధ్రప్రదేశ్ జట్టు బంగారు పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించి, "మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్" గా నిలిచాడు.
కబడ్డీ, క్రికెట్ లోనూ సత్తా 2022 పారా కబడ్డీ ఫెడరేషన్ లో బెస్ట్ డిఫెండర్, బెస్ట్ గేమ్ ఛేంజర్ అవార్డులు, 2023 ఫిజికల్ డిసెబిలిటీ T20 క్రికెట్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గణేష్ సాధించాడు.
ప్రభుత్వ చేయూత కోసం ఎదురుచూపు...
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నా, ఆర్థిక ఇబ్బందులతో సతమవుతున్న గణేష్ కు క్రీడల కోటాలో ప్రభుత్వం ఉద్యోగం కల్పించి, ఆర్థికంగా ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ప్రోత్సాహం లభిస్తే భవిష్యత్తులో దేశానికి మరిన్ని పతకాలు తెస్తానని గణేష్ ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాడు.