క్రమశిక్షణ, ప్రణాళికతో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలి
*మధురువాడ ఇంటిగ్రేటెడ్ బాయ్స్ హాస్టల్ సందర్శనలో కలెక్టర్ అభిషిక్త్ కిశోర్
*చిన్నారి బర్త్ డే సందర్భంగా కేక్ కట్ చేసి.. వారితో కలిసి భోజనం చేసిన కలెక్టర్
విశాఖపట్నం, సెప్టెంబర్ 24: భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలంటే విద్యార్థులు క్రమశిక్షణతో మెలగడంతో పాటు, స్పష్టమైన ప్రణాళిక, విజన్‌తో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ సూచించారు. మధురవాడలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ బాయ్స్ హాస్టల్‌ను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా హాస్టల్‌లోని వసతి, భోజనం, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. హాస్టల్‌లోని ఒక చిన్నారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి విద్యార్థులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. స్టడీ అవర్‌లో విద్యార్థులతో కలెక్టర్ ప్రత్యేకంగా ఇంటరాక్ట్ అయ్యారు. వారి చదువులు, భవిష్యత్ లక్ష్యాలు, ఆసక్తుల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో స్నేహపూర్వకంగా మాట్లాడి, వారి సందేహాలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ “మీరు కూడా నా లాగా కలెక్టర్ స్థాయికి ఎదగాలి. భవిష్యత్తులో మీలాంటి పిల్లలతో మీరు కూడా ఇలాగే ఇంటరాక్ట్ అయి, వారిని ప్రోత్సహించే స్థాయికి చేరుకోవాలి” అని విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించే దిశగా నిరంతరం కృషి చేయాలని సూచించారు. సమయపాలన, క్రమశిక్షణ, ప్రణాళికాబద్ధమైన చదువు, స్పష్టమైన లక్ష్యం విజయానికి ఎంతో ముఖ్యమని అన్నారు. ప్రతి విద్యార్థి జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని, తల్లిదండ్రులు, గురువులు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. సాంఘిక సంక్షేమ శాఖ ఇన్‌చార్జి డీడీ సత్యపద్మ, భీమిలి ఆర్డీవో సంగీత్ మాధుర్, హాస్టల్ వార్డెన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.