భీమిలి తీరంలో గుర్తుతెలియని మగ శిశువు మృతదేహం
ఘటనపై కేసు నమోదు..
మృతికి కారణాలపై పోలీసుల దర్యాప్తు..
భీమిలి,సెప్టెంబర్ 24, మేజర్ న్యూస్:
భీమిలి మండలం నేరెళ్లవలస గ్రామ పరిధిలోని భీమిలి బీచ్‌లో గుర్తుతెలియని మగ శిశువు మృతదేహం లభ్యమైన ఘటన కలకలం రేపింది. గురువారం ఉదయం సుమారు 8 గంటల సమయంలో భోగ్గు రోడ్-2 సచివాలయంలో వీఆర్వోగా పనిచేస్తున్న బింగి రాము పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృత శిశువు బొడ్డుకు క్లిప్ అమర్చబడి ఉన్నట్లు గుర్తించారు. శిశువు గుర్తింపు, మృతికి గల కారణాలపై పరిసర ప్రాంతాల్లోని వారిని పోలీసులు విచారించగా తమకు ఎలాంటి సమాచారం తెలియదని తెలిపారు. అనంతరం మృతదేహాన్ని భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై భీమిలి పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ జి. దివాకర్ యాదవ్ కేసు నమోదు చేసి, శిశువు గుర్తింపు, మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు.