స్థానిక ఎస్.కె.ఆర్ అండ్ ఎస్.కె.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (మహిళలు)లో బోటనీ విభాగం ఆధ్వర్యంలో మొదటి సంవత్సరం విద్యార్థినులకు బుధవారం బ్రిడ్జ్ కోర్సును ప్రారంభించారు.
బోటనీ బ్రిడ్జ్ కోర్సు ప్రారంభం
డిగ్రీ విద్యకు వారధిగా బ్రిడ్జ్ కోర్సు..
కడప మేజర్ న్యూస్
స్థానిక ఎస్.కె.ఆర్ అండ్ ఎస్.కె.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (మహిళలు)లో బోటనీ విభాగం ఆధ్వర్యంలో మొదటి సంవత్సరం విద్యార్థినులకు బుధవారం బ్రిడ్జ్ కోర్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. స్మిత మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్య పూర్తిచేసి నూతనంగా డిగ్రీలో చేరిన విద్యార్థినులకు బ్రిడ్జ్ కోర్సు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యకు ఉన్నత విద్యకు మధ్య ఈ కోర్సు వారధిగా నిలుస్తుందని పేర్కొన్నారు. విద్యార్థినులను విశ్వవిద్యాలయాలు, భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) వంటి ప్రముఖ పరిశోధనా సంస్థలకు క్షేత్రస్థాయి పరిశీలనకు తీసుకెళ్లడం ద్వారా వారిలో పరిశోధనా ఆసక్తిని పెంపొందించవచ్చని తెలిపారు. తద్వారా భవిష్యత్తులో వారు శాస్త్రవేత్తలుగా ఎదిగి దేశాభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని ఆకాంక్షించారు. బ్రిడ్జ్ కోర్సును నిర్వహిస్తున్న బోటనీ విభాగాన్ని ఆమె అభినందించారు. అనంతరం బోటనీ విభాగాధిపతి డాక్టర్ పి. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అగ్రికల్చర్ డిప్లొమా, సెరికల్చర్, ఓపెన్ స్కూల్ తదితర విభిన్న విద్యా నేపథ్యాల నుంచి కళాశాలలో చేరే విద్యార్థినులకు వృక్షశాస్త్రంలోని ప్రాథమిక భావనలు, సాంకేతిక పదజాలం, ప్రయోగాత్మక అంశాలపై పూర్తి అవగాహన కల్పించడమే బ్రిడ్జ్ కోర్సు ప్రధాన ఉద్దేశమని వివరించారు. ఈ కోర్సు ద్వారా విద్యార్థినులు వృక్షశాస్త్రంపై పునాది జ్ఞానాన్ని పెంపొందించుకుని డిగ్రీ విద్యను సులభంగా అభ్యసించగలరని పేర్కొన్నారు. కార్యక్రమంలో బోటనీ అధ్యాపకులు ఎ. అనురాధ, రాజేశ్వరి, మొదటి సంవత్సరం విద్యార్థినులు పాల్గొన్నారు..