చేతికొచ్చిన పంట నీటిపాలు..!! *అన్నదాతను ఆదుకోండి *
పద్మనాభం, సూర్య : పద్మనాభం మండలాన్ని అర్నాబ్ తుపాను వణికించింది. తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు వ్యవసాయ ఆధారిత గ్రామాలైన కృష్ణాపురం, పద్మనాభం పరిధిలో వరి పంట పూర్తిగా నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో కృష్ణాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి మొకర వినయ్ స్పందిస్తూ, నష్టపోయిన రైతులను ప్రభుత్వం, అధికారులు వెంటనే ఆదుకోవాలని కోరారు. వినయ్ మాట్లాడుతూ, "రైతులు ఎకరాకు రూ.25 వేల నుండి రూ.30 వేల వరకు అప్పు చేసి మరీ పెట్టుబడి పెట్టారు. పంట చేతికి వచ్చే సమయంలో ఈ తుపాను వచ్చి అంతా నాశనం చేసింది. కోతకు సిద్ధంగా ఉన్న వరి వర్షపు నీటిలో మునిగి రంగు మారిపోయింది. ఇది కేవలం పంట నష్టం కాదు, రైతు జీవితానికి నష్టం" అని ఆవేదన వ్యక్తం చేశారు. "నేను ఒక ఎంపీటీసీ అభ్యర్థిగా కాదు, ఒక రైతు బిడ్డగా మాట్లాడుతున్నాను. ఇది ఎన్నికల అంశం కాదు, రాజకీయ అంశం కాదు. పార్టీలకు అతీతంగా నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలి. అధికారులు క్షేత్ర స్థాయిలోకి వచ్చి, తుపాను ప్రభావంతో నీట మునిగిన ప్రతి ఎకరాను పరిశీలించి, న్యాయమైన నష్టపరిహారం అందించేలా చూడాలి" అని వినయ్ ప్రభుత్వాన్ని కోరారు. మండల వ్యవసాయ అధికారి, తహశీల్దార్ వెంటనే స్పందించి పంట నష్టం అంచనా వేసి రైతులకు భరోసా ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తాను స్వయంగా తుపాను ప్రభావిత పొలాలను పరిశీలించినట్లు, రైతుల కష్టం చూసి చలించిపోయానని తెలిపారు.
రిపోర్టర్ : త్రినాధ్, పద్మనాభం మండలం, విశాఖపట్నం.