చెంచులక్ష్మి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్.
కల్లూరు లోని శ్రీనివాస నగర్ లో ఉన్న చెంచులక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ కమిటీతోపాటు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ చెంచు సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు తమ సంపాదనలో కొంత భాగాన్ని తీసి ఉంచి ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించడం అభినందనీయమని తెలియజేశారు. మన సమీపంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఉండటంవల్ల ఆయనను చూసి పొరపాట్లు చేయకుండా జీవనం సాగించవచ్చని తెలియజేశారు. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలు శాంతి సౌభాగ్యాలతో ఆరోగ్యంగా జీవించాలని ఆయన ఆకాంక్షించారు .శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించిన ఆలయ కమిటీ ప్రతినిధులను ఆయన అభినందించారు. అలాగే సంకల్ బాగ్ లో తమ ఇంటి వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల సమయంలో ప్రారంభం రోజు జరిగే ధ్వజారోహణ సందర్భంగా ,అలాగే చివరి రోజు జరిగే స్వామి వారి చక్ర స్నానం సందర్భంగా ఆలయం పై భాగంలో గరుడ పక్షులు ప్రదక్షిణలు చేయడం గొప్ప విశేషమని తెలియజేశారు. ప్రతి సంవత్సరం ఆలయం బ్రహ్మోత్సవాల సందర్భంగా గరుడ పక్షులు ఆలయం పై ప్రదక్షిణలు చేయడం ఈ ప్రాంతం విశిష్టతకు నిదర్శనం అని చెప్పారు. అలాగే స్వామివారి చక్రస్నానం చేసే సమయంలో తీసుకు వెళ్లేటప్పుడు బరువుతో ఉండే స్వామి వారి విగ్రహం స్నానం చేయించిన తర్వాత బరువు తక్కువగా మారుతుందని ఇది మరో విశిష్టత అని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకొని భక్తి మార్గంలో ప్రజలకు మంచి చేసే విధంగా ముందుకు సాగాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆకాంక్షించారు.