చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి – మంత్రి ఆనం
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ప్రజలందరికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.దుర్గామాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి. రాష్ట్ర పునర్నిర్మాణం, ప్రజా సంక్షేమం, సుపరిపాలనే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. దసరా స్ఫూర్తితో విధ్వంసక రాజకీయాలకు స్వస్తి పలికి, అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి పర్వదినం ప్రతి ఒక్కరి జీవితంలో నూతన ఆశలు, ఆనందాలు, విజయాలు నింపాలని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణరెడ్డి ఆకాంక్షించారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలందరికీ మంత్రి ఆనం హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. జగన్మాత దుర్గాదేవి కృపాకటాక్షాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రైతన్నల కష్టానికి తగిన ఫలితం దక్కాలని, ప్రతి ఇంటా సిరిసంపదలు, సుఖశాంతులు వెల్లివిరియాలని ప్రార్థించారు. విజయదశమి పండుగ మనకు అందించే సందేశం కేవలం చెడుపై మంచి విజయమే కాకుండా, సమాజంలో ధర్మం, న్యాయం, సత్యం, ప్రజాహితం ఎల్లప్పుడూ విజయం సాధిస్తాయనే విశ్వాసమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే అంతిమ నిర్ణేతలని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే నాయకత్వానికే ప్రజాదరణ లభిస్తుందని అన్నారు. గత విధ్వంసక పాలనకు స్వస్తి పలికిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనకు పట్టం కట్టారని మంత్రి ఆనం పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రజాహితానికి, ప్రాంతీయ అభివృద్ధికి కట్టుబడిన నాయకత్వాన్ని ఆదరించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థ నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ సహకారంతో, యువ నాయకులు నారా లోకేష్ ప్రత్యేక చొరవతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర పునర్నిర్మాణానికి అంకితభావంతో కృషి చేస్తోందని తెలిపారు. వ్యవసాయం, విద్య, వైద్యం, ఉపాధి, గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు దేవాలయాల అభివృద్ధి, హిందూ ధర్మ పరిరక్షణ, ధార్మిక సంప్రదాయాల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని వివరించారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని, ప్రజల ఆశీస్సులు, సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని మంత్రి ఆనం పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలని, నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గ ప్రజల ప్రతి కుటుంబంలో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.