వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (అక్టోబర్ 19): పాలపిట్టను సంరక్షిస్తూ ప్రకృతి సమతుల్యతను కాపాడాలని, వన్యప్రాణుల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా అటవీ శాఖ అధికారి (డీఎఫ్‌ఓ) విశాల్ బత్తుల, ఐఎఫ్‌ఎస్ పిలుపునిచ్చారు. దసరా పండుగను పురస్కరించుకుని సోమవారం ఆయన జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, ఐఏఎస్, జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్‌లను మర్యాదపూర్వకంగా కలిసి జమ్మి చెట్టును అందజేసి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ‘ACT NOW – SAVE పాలపిట్ట’ నినాదంతో రూపొందించిన గోడ పోస్టర్‌ను ఆవిష్కరించారు. పాలపిట్ట సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, వన్యప్రాణుల పరిరక్షణకు ప్రజలను భాగస్వాములను చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అటవీ శాఖ అధికారులు తెలిపారు. పర్యావరణ సమతుల్యతకు వన్యప్రాణులు ఎంతో కీలకమని, జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు ప్రజల సహకారం అవసరమని పేర్కొన్నారు. పాలపిట్టతో పాటు ఇతర వన్యప్రాణులను సంరక్షిస్తూ ప్రకృతిని కాపాడుకోవాలని ఈ ప్రచారం ద్వారా సందేశాన్ని అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ ఇన్‌ఛార్జి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పి. నాగేశ్వరరావు పాల్గొన్నారు.