బూదిగుమ్మ బ్రిడ్జి పనుల్లో వేగం పెంచాలి
అనంతపురం బ్యూరో : బెళుగుప్ప మండలం బూదిగుమ్మ వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులను ఆదేశించారు. గురువారం బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన, పనుల పురోగతి, నాణ్యతపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో ప్రజలకు రాకపోకల ఇబ్బందులు కలగకుండా పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని సూచించారు.
బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే పరిసర గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా స్థానికులు తెలిపిన సమస్యలను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.