హార్టికల్చర్ హబ్‌లో పర్చూరుకు అవకాశం.. సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే ఏలూరి కృతజ్ఞతలు
సూర్య ప్రతినిధి, ఒంగోలు : రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేసే ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పర్చూరు నియోజకవర్గానికి అవకాశం కల్పించడం పట్ల ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు హర్షం వ్యక్తం చేశారు. పర్చూరు ప్రాంత రైతులకు కొత్త అవకాశాలు అందుబాటులోకి తీసుకురానున్న ఈ కార్యక్రమానికి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 2న మదనపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని మార్టూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద పర్చూరు నియోజకవర్గ రైతులతో కలిసి ఎమ్మెల్యే ఏలూరి లైవ్‌స్ట్రీమింగ్ ద్వారా వీక్షించనున్నారు.
పర్చూరు రైతులకు కొత్త అవకాశాలు
రాయలసీమను దేశంలోనే కీలకమైన ఉద్యాన ఉత్పత్తుల కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా పర్చూరు నియోజకవర్గానికి అవకాశం కల్పించడం ద్వారా ఇక్కడి ఉద్యాన రైతులకు కొత్త అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. మామిడి, మిరప, కూరగాయలు, ఆయిల్‌పామ్ తదితర ఉద్యాన పంటల సాగుతో పాటు పంట కోత అనంతర నిర్వహణ, ప్రాసెసింగ్, నిల్వ, రవాణా, మార్కెటింగ్, ఎగుమతులకు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
రైతులతో ముఖాముఖి.. ఉద్యాన సాగుపై చర్చ
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉద్యాన పంటల సాగు, రైతుల అవసరాలు, మార్కెటింగ్, ప్రాసెసింగ్, సాగునీరు తదితర అంశాలపై రైతులతో చర్చించనున్నారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ద్వారా పర్చూరు ప్రాంత రైతులకు కలిగే అవకాశాలు, ప్రభుత్వం అందించనున్న ప్రోత్సాహకాలపై రైతులకు అవగాహన కల్పించనున్నారు.
హార్టికల్చర్ హబ్‌తో మార్కెటింగ్, ప్రాసెసింగ్‌కు ఊతం
మదనపల్లిలో జరిగే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మార్టూరులో రైతులతో కలిసి వీక్షించడం ద్వారా గ్లోబల్ హార్టికల్చర్ హబ్ లక్ష్యాలు, పర్చూరు నియోజకవర్గానికి దక్కిన అవకాశాలను రైతులకు వివరించనున్నట్లు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెలిపారు. ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు, వ్యవసాయ రంగానికి చెందిన వారు ఈ నెల 2న మార్టూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగే కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ఏలూరి పిలుపునిచ్చారు. పర్చూరు నియోజకవర్గానికి గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌లో అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.