బంగారు బందరుగా మచిలీపట్నం తీర్చిదిద్దుతాం
బంగారు బందరుగా మచిలీపట్నం తీర్చిదిద్దుతాం
రూ.6 కోట్లతో 22 అభివృద్ధి పనులకు శ్రీకారం
రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం, సెప్టెంబరు 30, మేజర్ న్యూస్ (ప్రేమ్ రాజ్) : మచిలీపట్నం నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి బంగారు బందరుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. బుధవారం ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావుతో కలిసి నగరంలో సుమారు రూ.6 కోట్ల విలువైన 22 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తొలుత 19వ డివిజన్‌లో రైల్వే స్టేషన్ సమీపంలోని ఆధునికీకరించిన పైలాన్ పార్కును ప్రారంభించారు. రహదారులు, డ్రైనేజీలు, తాగునీరు, వీధి దీపాలు, పార్కులు, శ్మశాన వాటికలు, ప్రహరీ గోడలు తదితర మౌలిక వసతులకు సంబంధించిన పనులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే మున్సిపాలిటీ పరిధిలో రూ.52 కోట్ల హైబ్రిడ్ యాన్యుటీ విధానం నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. నగరాన్ని మరింత సుందరంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రజల అవసరాలను గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపడుతున్నామని చెప్పారు. చేపట్టిన పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ నాని, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, కూటమి నాయకులు, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.