భక్తిశ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు
మాకవరపాలెం , నవంబర్ 13 ,మేజర్ న్యూస్:
మాకవరపాలెం మండలవ్యాప్తంగా శుక్రవారం నాగుల చవితి పర్వదినాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజామునే భక్తులు తలస్నానాలు ఆచరించి కుటుంబ సమేతంగా సమీపంలోని నాగుల పుట్టల వద్దకు చేరుకున్నారు. పుట్టలకు పసుపు, కుంకుమలు సమర్పించి పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చలిమిడి, వడపప్పు, పాలు, కోడిగుడ్లను నైవేద్యంగా సమర్పించి నాగేంద్రుడికి మొక్కులు చెల్లించుకున్నారు. నాగదేవత అనుగ్రహంతో కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని భక్తులు ప్రార్థించారు. దీంతో మండలంలోని పలు గ్రామాల్లో పుట్టల వద్ద పండుగ సందడి నెలకొంది.