బలిజిపేటలో ఎమ్మెల్యే విజయచంద్రకు ఘన స్వాగతం.. టీడీపీ శ్రేణుల భారీ బైక్ ర్యాలీ
బలిజిపేట, సూర్య: మండలంలో టీడీపీ శ్రేణులు బుధవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించాయి. మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలతో పాటు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్రకు నూతనంగా ఎన్నికైన 14 మంది ఎంపీటీసీ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.
ఎమ్మెల్యే బలిజిపేటకు చేరుకున్న సందర్భంగా సుమారు ఆరు కిలోమీటర్ల మేర ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. దారిపొడవునా నాయకులు, కార్యకర్తలు పూలమాలలు, పుష్పగుచ్ఛాలతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ఈ ర్యాలీకి అరకు పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షుడు బూరాడ రామ్మోహన్ రావు నాయకత్వం వహించారు.
అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఎన్నికల ప్రక్రియలో మండల పరిషత్ అధ్యక్షురాలిగా బూరాడ మహాలక్ష్మి, ఉపాధ్యక్షురాలిగా బెవర సూర్య ప్రభావతిని ఎంపీటీసీ సభ్యులు ఎన్నుకున్నారు. ఎన్నికల అనంతరం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర నూతనంగా ఎన్నికైన ఎంపీపీ, వైస్ ఎంపీపీతో పాటు ఎంపీటీసీ సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.