andhrapradesh
బాపట్ల జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పదవి ఎవరికి? వేమూరు – పర్చూరు నియోజకవర్గాల మధ్య ఆసక్తికర పోటీ!
భట్టిప్రోలు, మేజర్ న్యూస్
బాపట్ల జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని రేపల్లె నియోజకవర్గానికి కేటాయించిన నేపథ్యంలో, ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో వైస్ చైర్మన్ పదవిపై ఉత్కంఠ నెలకొంది. జిల్లాలోని మొత్తం 20 జడ్పీటీసీ స్థానాల్లో బాపట్ల, చీరాల నియోజకవర్గాలకు చెందిన రెండు స్థానాలు వైసీపీ ఖాతాలోకి వెళ్లగా, మిగిలిన స్థానాల్లో కూటమి ఆధిపత్యం కనిపిస్తోంది. ముఖ్యంగా వైస్ చైర్మన్ పదవి కోసం వేమూరు, పర్చూరు నియోజకవర్గాల మధ్య ప్రధాన పోటీ నెలకొన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. వేమూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఐదు జడ్పీటీసీ స్థానాలనూ కూటమి పార్టీ కైవసం చేసుకుని 100 శాతం స్ట్రైక్ రేట్ నమోదు చేయడం విశేషం. ఈ నేపథ్యంలో వైస్ చైర్మన్ పదవిని వేమూరు నియోజకవర్గానికి కేటాయించాలనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.
రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం, వేమూరు ఎమ్మెల్యే శ్రీ నక్కా ఆనందబాబు గారు కూడా వైస్ చైర్మన్ పదవి వేమూరు నియోజకవర్గానికి దక్కాలని పట్టుబట్టే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు పర్చూరు నియోజకవర్గం కూడా వైస్ చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి రేపల్లెకు ఖరారైన నేపథ్యంలో, వైస్ చైర్మన్ పదవి వేమూరుకు దక్కుతుందా? లేక పర్చూరుకు కేటాయిస్తారా? అన్నది ఇప్పుడు బాపట్ల జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వైస్ చైర్మన్ పీఠం ఎవరి సొంతం కాబోతోంది? వేచి చూడాల్సిందే!