బాణాసంచా షాపుల్లో భద్రతా ప్రమాణాలు తప్పనిసరి
గాజువాక, సూర్య : బాణాసంచా దుకాణాల వద్ద వ్యాపారులు ప్రభుత్వ భద్రతా నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని జోన్-II డీసీపీ మేరీ ప్రశాంతి హెచ్చరించారు. శుక్రవారం సౌత్ జోన్ ఏసీపీ వై.శ్రీనివాసరావుతో కలిసి గాజువాక నక్కవారిపాలెం గ్రౌండ్‌లోని తాత్కాలిక బాణాసంచా దుకాణాలతో పాటు షీలానగర్‌లోని 'అయ్యాను క్రాకర్స్' విక్రయ కేంద్రాలను ఆమె క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. వ్యాపారుల లైసెన్సులు, గడువు ముగిసే తేదీలను పరిశీలించిన అధికారులు, నిబంధనలకు విరుద్ధంగా అనుమతించిన పరిమితికి మించి నిల్వలు ఉంచరాదని స్పష్టం చేశారు.
అగ్నిప్రమాదాల నివారణకు ప్రతి దుకాణం వద్ద అగ్నిమాపక పరికరాలు, ఇసుక, నీటి బకెట్లను సిద్ధంగా ఉంచుకోవాలని డీసీపీ ఆదేశించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌లకు తావివ్వకుండా చూసుకోవాలని, దుకాణాల వద్ద ధూమపానాన్ని కఠినంగా నిషేధించాలని సూచించారు. దుకాణాల వద్ద రద్దీ పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, రోడ్లపై వాహనాల పార్కింగ్ వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూడాలన్నారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే వెంటనే పోలీస్, అగ్నిమాపక శాఖలకు సమాచారం అందించాలని తెలిపారు. ఈ తనిఖీల్లో గాజువాక లా అండ్ ఆర్డర్ సీఐ వాసునాయుడు, ట్రాఫిక్ సీఐ షేక్ హుస్సేన్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.