దేవి శరన్నవరాత్రులు ఘనంగా ప్రారంభం కావడంతో అనంత నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఆయా దేవాలయాలు విద్యుత్ దీపాలంకరణతో కాంతులీనుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో కొలువైన అమ్మవార్లు పలు రూపాల్లో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శృంగేరి శంకరమఠంలో శారద పరమేశ్వరి బ్రాహ్మ అలంకరణలో భక్తులకు సాక్షాత్కరించారు. యాగశాలలో నవరాత్రుల దినోత్సవాల్లో భాగంగా మొదట మోదక హోమంతో గణపతి హోమంతో ప్రారంభించారు.
శ్రీ కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయంలో బాల త్రిపుర సుందరీ దేవి అవతారంలో దర్శనమిస్తున్న అమ్మవారు.
శ్రీ కాశీ విశ్వేశ్వర కోదండ రామాలయం 1 వ రోడ్డు దసరా నవరాత్రుల సందర్భంగా దీక్షాబంధన అలంకారంలో శారద దేవి అమ్మవారు దర్శనమిచ్చారు.
*శివ బాలయోగి మహారాజ్ ఆశ్రమంలో*
దసరా శరన్నవరాత్రుల మహోత్సవ సందర్భంగా మొదటి రోజు ఉదయం 6:30 నుండి గంగ పూజ,గణపతి పూజ, పుణ్యా హవాచనం,కలిశా స్థాపన, పంచ గవ్యం, నాంది సప్త మాత్వకుల పూజ, తదుపరి అనంతేశ్వరి అనంతేశ్వర స్వామి వారికి ఏకవార రుద్రాభిషేకం, అర్చన, మహా మంగళ హారతి తీర్థప్రసాదాలు అందించారు. అనంతేశ్వరి దేవీ భక్తులకు గజలక్ష్మి అలకారం లో దర్శనం ఇచ్చింది. ఆయా దేవాలయాల కమిటీ సభ్యులు భక్తుల సౌకర్యార్థం విశేష ఏర్పాట్లను చేశారు. అనంతరం భక్తాదులకు తీర్థ ప్రసాదాలను వితరణ గావించారు.
*చాముండేశ్వరి దేవాలయంలో నృత్య నీరాజనం*
చాముండేశ్వరి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల మొదటి రోజు భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో నృత్య నీరాజన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కుమారి హిమజ, ఆమె బృంద సభ్యులు ప్రదర్శించిన నృత్య కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అమ్మవారికి నృత్య రూపంలో నీరాజనం సమర్పిస్తూ కళాకారులు తమ ప్రతిభను చాటుకున్నారు.
(మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్)