అంగన్వాడీలకు పోషణ్ భీ పఢాయి భీ శిక్షణ
భోగాపురం, సూర్య : అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు మెరుగైన పోషకాహారం, నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్య అందించడమే లక్ష్యంగా నిర్వహించిన ‘పోషణ్ భీ పఢాయి భీ’ రెండో దశ మొదటి బ్యాచ్ శిక్షణ మంగళవారంతో విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సీడీపీఓ ఆరుద్ర మాట్లాడుతూ.. రెండు రోజుల శిక్షణలో నేర్చుకున్న అంశాలను అంగన్వాడీ కేంద్రాల్లో సమర్థవంతంగా అమలు చేయాలని కార్యకర్తలకు సూచించారు. పిల్లల ఎదుగుదల పర్యవేక్షణ, పోషణ్ ట్రాకర్ వినియోగం, ప్రీ స్కూల్ బోధనా పద్ధతులపై ప్రత్యేక అవగాహన కల్పించినట్లు తెలిపారు. శిక్షణలో భాగంగా మాస్టర్ ట్రైనర్లు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు సత్యవాణి, సుభాషిణి, రాజేశ్వరి, శ్రీదేవి చిన్నారుల ప్రాథమిక వికాసం, ఆటపాటల ద్వారా విద్యాబోధన, ఎత్తు, బరువు కొలతలు, పోషకాహార లోపాల గుర్తింపు, డిజిటల్ సేవలు, దివ్యాంగ పిల్లల గుర్తింపు, రిఫరల్ విధానాలపై ఆచరణాత్మక శిక్షణ అందించారు. శిక్షణ ద్వారా పొందిన పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో వినియోగించి చిన్నారులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
* రేపటి నుంచి రెండో బ్యాచ్
మొదటి బ్యాచ్ శిక్షణ విజయవంతం కావడంతో తదుపరి అంగన్వాడీ కార్యకర్తలకు నవంబర్ 11 నుంచి రెండు రోజుల పాటు రెండో బ్యాచ్ శిక్షణ ప్రారంభం కానుందని సీడీపీఓ ఆరుద్ర వెల్లడించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.