అంబరాన్ని తాకిన కొత్తమ్మతల్లి సంబరాలు
`- పోటెత్తిన భక్తజన సందోహాం
- ఘనంగా ముగిసిన మూడో రోజు ఉత్సవాలు
కోటబొమ్మాళి, స్థానికంగా కొలువైయున్న శ్రీ కొత్తమ్మతల్లి 101 వ వార్షిక జాతర ఉత్సవాలు సంబరాలు అంబరాన్ని తాకాయి. మంగళవారం నుండి గురువారం వరకు మూడు రోజులు పాటు జరిగిన ఈ ఉత్సావాలు చివరి రోజైన గురువారం అత్యంత వైభవంగా ముగిసాయి. ఈ ఉత్సవాలు సందర్బంగా గురువారం వేకువజాము నుండే భక్తులు వేలాది సంఖ్యలో క్యూలైన్లులో బారులుతీరి కొత్తమ్మతల్లిని దర్శించుకున్నారు. వేకువ జాము నుండే భక్తులు వేలాది సంఖ్యలో కొత్తమ్మతల్లిని దర్శించుకోని మ్రొక్కుబడులను తీర్చుకున్నారు. కొత్తపేట జంక్షన్ నుండి కోటబొమ్మాళి వరకు రెండు కిలోమీటర్లు దారి పొడవున భక్తుల రద్దీ ఉండడంతో పాదచారులు, వాహానదారులు నానా అవస్దలు పడవలసి వచ్చింది. పోలీస్ శాఖ వారు ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి పలు చోట్ల వాహనాలను పార్కింగ్ చేయించారు. పగటి పూట గ్రామంలో పగటి వేషాలు, కోయి డ్యాన్సులు భక్తులను అలరించాయి. స్దానిక రెడ్డిక వీదిలో గల కమ్మకట్టు చిన్నఅప్పలస్వామి ఇంటి నుండి అమ్మవారి జంగిడిని పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు మద్య తీసుకురాగా మహిళలు పసుపు కలశాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారి దండకం చదివి తల్లిని చల్లదనం చేసారు. మెయిన్రోడ్డులో పోస్టు ఆఫీస్ అవరణలో రైసు మిల్లర్ల ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న సంతర్పణలో వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ప్రజాపిత బ్రహ్మకూమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంకు చెందిన ఓంశాంతి వారు ఆద్యాత్మిక ప్రవచనాలు భక్తులను ఎంతగానో ఆలోచింపజేసాయి. ఈ సారి ఉత్సవాలకు ఎగ్జిబిషన్లో గల జైంట్వీల్, శాంతారా, టోరాటోరా, సలంబో, బ్రేక్ డ్యాన్స్తో పాటు స్విమ్మింగ్, రైలు, బెలూన్ వంటివి చిన్న పిల్లలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో భక్తులు మూడు రోజులు కూడా చుట్టూ ప్రక్కల ప్రాంతాల నుండి అదిక సంఖ్యలో విచ్చేసారు. మొత్తంగా ఈ సారి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరగడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేసారు. అలాగే అమ్మవారికి దర్శించుకున్న భక్తులకు ఆలయకమిటి సభ్యులు 40వేలు మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.