అక్వాన్ తుఫాన్ నేపథ్యంలో ఐటీడీఏలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
సీతంపేట సూర్య: అక్వాన్ తుఫాన్ నేపథ్యంలో ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సీతంపేట ఐటీడీఏ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఐటీడీఏ పీవో పవార్ స్వప్నిల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు, వాగులు, వంకల సమీపంలో నివసించే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు భయాందోళనలకు గురికాకుండా అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. తుఫాన్ కారణంగా ఏవైనా ఇబ్బందులు, అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే ఐటీడీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని సూచించారు. ఇందుకోసం 9392917709 నంబర్‌ను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ అవసరమైన సహాయ చర్యలు చేపట్టేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు.