అభివృద్ధి మంత్రంగా రేవతి ప్రచారం
పూసపాటిరేగ, సూర్య : స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జడ్పిటిసి అభ్యర్థినిగా తనను గెలిపిస్తే మండలంలో ఉన్న గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని కోట్ల రేవతి ఎన్నికల ప్రచారంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మండలంలోని తీరప్రాంత మత్స్యకార గ్రామాలతో పాటు గుంపం, కుమిలి ఎంపీటీసీ సెగ్మెంట్లలో విస్తృతంగా ప్రచారాన్ని గురువారం నిర్వహించారు. ప్రచారంలో రేవతి ముందంజలో ఉండడమే కాకుండా ఇంటింటికి వెళ్లి తన భర్త రఘు చేపట్టిన సేవా కార్యక్రమాలతో పాటు జరగబోయే ఎన్నికల్లో జడ్పిటిసిగా తనను గెలిపిస్తే మండలాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తన స్వగ్రామమైన కొవ్వాడకు తన భర్త రఘు రెండు పరిశ్రమలు తెచ్చి ఎంతోమంది యువతకు ఉపాధి కల్పించారని, మరిన్ని పరిశ్రమలు రావాలంటే తనను జడ్పిటిసి గా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే తన భర్త రఘు సహకారంతో పరిశ్రమలు ఏర్పాటుకు కృషిచేసి యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. కుమిలిలో ఏఎంసి మాజీ చైర్మన్, తెదేపా రాష్ట్ర నాయకుడు దల్లి ముత్యాల రెడ్డి స్వగృహానికి వెళ్లి అతని ఆశీస్సులు పొందడమే కాకుండా తెదేపా ఎంపీటీసీగా పోటీ చేస్తున్న గౌతమ్ రెడ్డితో కలిసి కుమిలిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో అధికమంది మహిళతో పాటు కూటమిలో ఉన్న తెదేపా, జనసేన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రిపోర్టర్ : రమేష్, పూసపాటిరేగ, విజయనగరం జిల్లా.