22 మంది దివ్యాంగులకు రూ.11 లక్షల విలువైన కృత్రిమ అవయవాల ఉచిత పంపిణీ
సూర్య, నంద్యాల బ్యూరో:
ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, నంద్యాల శాఖ మరియు భారత్ వికాస్ పరిషత్, నంద్యాల శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు అండగా నిలవాలనే గొప్ప సంకల్పంతో ఉచిత కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆనంద్ గురూజీ ఆధ్వర్యంలో మొత్తం 40 మంది దివ్యాంగులను ఎంపిక చేయగా, వారిలో 22 మందికి ఉచితంగా కృత్రిమ కాళ్లను అందజేయడం జరిగింది. ఒక్కొక్క కృత్రిమ అవయవం విలువ సుమారు రూ.50,000 కాగా, మొత్తం 22 మందికి సుమారు రూ.11 లక్షల విలువైన కృత్రిమ అవయవాలను ఉచితంగా అందించారు. ఈ మహత్తర సేవా కార్యక్రమానికి షేర్ ఇండియా వ్యవస్థాపకులు ప్రొఫెసర్ పి. సుధాకర్ రెడ్డి డా. ప్రకాష్ శ్రీవాస్తవ మరియు నంద్యాల వాస్తవ్యులు డా. పబ్బు చిరంజీవి దీక్షిత్ అందించిన సహకారం ఎంతో అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆపద్బాంధవ సేవా సమితి అధ్యక్షులు గోళ్ళసుదర్శన్ కౌన్సిలర్ ఖండే శ్యామ్ సుందర్ లాల్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో భారత్ వికాస్ పరిషత్ సభ్యులు జెట్టి వెంకటేశ్వరులు పాలూరు రాజా కూరాకు వీరాంజనేయ ప్రసాద్ ధనుంజయ వర్మ జనార్ధన్ తదితరులు పాల్గొని కార్యక్రమ విజయవంతానికి తమ సహకారాన్ని అందించారు. ఆనంద్ గురూజీ మాట్లాడుతూ.గత 20 సంవత్సరాలుగా నంద్యాల పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో వేలాది సేవా కార్యక్రమాలను లక్షలాది రూపాయల వ్యయంతో నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ 20 సంవత్సరాల సేవా ప్రయాణంలో అన్నదాన కార్యక్రమాలు, పేదలకు కంటి ఆపరేషన్లు, ఉచిత వైద్య శిబిరాలు, దుస్తుల పంపిణీ, నిరుపేద వధూవరుల వివాహాలకు ఆర్థిక సహాయం, పేద విద్యార్థులకు విద్యా సహాయం వంటి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ సమాజానికి తమ వంతు సహకారం అందించడం జరిగిందని పేర్కొన్నారు. అయితే ఇన్ని సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ, ఈరోజు దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందించే కార్యక్రమం మాత్రం తన హృదయాన్ని ఎంతగానో కదిలించిందని, కంటతడి పెట్టించిందని భావోద్వేగంగా తెలిపారు. మేము దివ్యాంగులకు సేవ చేశామని చెప్పుకోవడం లేదు. మాకు సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించినది వారే. వారి జీవితాల్లో కొంత వెలుగును నింపే అవకాశం మాకు కల్పించిన ప్రతి ఒక్క దివ్యాంగుడికి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. వారి ముఖాల్లో కనిపించిన ఆనందమే మాకు నిజమైన సంతృప్తి. ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగించడానికి భగవంతుడు తమకు ఆయురారోగ్యాలు, శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానని, దాతలు, సేవా సంస్థలు, మిత్రులు అందించే సహకారంతో భవిష్యత్తులో మరిన్ని బృహత్తర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆనంద్ గురూజీ తెలిపారు.
మనిషి జీవితంలో సంపాదించేది సంపద మాత్రమే కాదు… మనం చేసే సేవ ద్వారా ఇతరుల జీవితాల్లో నింపే ఆనందమే నిజమైన సంపద అన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రొఫెసర్ పి. సుధాకర్ రెడ్డి గారికి, వైద్యులకు, ముఖ్య అతిథులకు, భారత్ వికాస్ పరిషత్ సభ్యులకు, రెడ్‌క్రాస్ సభ్యులకు, దాతలకు మరియు కార్యకర్తలకు ఆనంద్ గురూజీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*