18వ సారి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్న కోట ప్రభాకర్
వత్సవాయి, మేజర్ న్యూస్ : ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన మానవత్వమని వత్సవాయి మండలం మాచినేనిపాలెం గ్రామానికి చెందిన రైల్వే ఉద్యోగి కోట ప్రభాకర్ నిరూపించారు. అత్యవసర పరిస్థితిలో ఉన్న ఓ రోగికి రక్తం అవసరమని తెలియడంతో వెంటనే స్పందించి విజయవాడకు వెళ్లి 18వ సారి రక్తదానం చేశారు.వత్సవాయి మండలం గట్టు భీమవరం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గుండె సంబంధిత సమస్యతో విజయవాడలో చికిత్స పొందుతున్నారు. గుండె రక్తాన్ని పంపింగ్ చేసే సామర్థ్యం తగ్గడంతో పాటు హిమోగ్లోబిన్ స్థాయి 6 గ్రాములకు పడిపోవడంతో వైద్యులు అత్యవసరంగా ఏబీ పాజిటివ్ (AB+) రక్తం అవసరమని సూచించారు.ఈ విషయం తెలుసుకున్న కోట ప్రభాకర్ తన వ్యక్తిగత పనులను పక్కనపెట్టి మాచినేనిపాలెం నుంచి విజయవాడకు చేరుకుని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఇప్పటికే పలుమార్లు రక్తదానం చేసిన ఆయన 18వ సారి రక్తదానం చేసి తన సేవా గుణాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా రక్తదాత కోట ప్రభాకర్‌కు రోగి కుటుంబ సభ్యులు, వైద్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన సేవా స్ఫూర్తిని గ్రామస్థులు అభినందించారు.ఈ కార్యక్రమంలో షేక్ అబూబాకర్, ముండ్లపాటి శరత్, గోళ్ల శ్రీను, చేని రాంబాబు, పీజే మార్క్ తదితరులు సహకారం అందించారు.రక్తదానం ప్రాణదానంతో సమానమని, ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పలువురు కోరారు.