పసుపు సైనికులతో దద్దరిల్లిన కళ్యాణదుర్గం పట్టణం.
కళ్యాణదుర్గం: పసుపు జెండాలు రెపరెపలాడుతూ, వేలాది మంది తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలతో కళ్యాణదుర్గం పట్టణం పసుపుమయంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి సాధించిన ఘన విజయాన్ని పురస్కరించుకుని శుక్రవారం నిర్వహించిన విజయోత్సవ ర్యాలీ జనప్రభంజనాన్ని తలపించింది. పట్టణ ప్రధాన వీధులన్నీ పసుపు సైనికులతో కిక్కిరిసిపోయాయి. జై చంద్రన్న.. జై సురేంద్ర అన్న అంటూ కార్యకర్తలు చేసిన నినాదాలతో దుర్గం వీధులు హోరెత్తాయి. ఈ విజయోత్సవ ర్యాలీకి ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు, సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గెలుపొందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రజల్లో మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని కార్యకర్తలకు సూచించారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లోనూ అన్ని గ్రామాల్లో టీడీపీ మద్దతుదారులు విజయదుందుభి మోగించేలా సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, ఐదుగురు జడ్పీటీసీలు, ఎంపీటీసీ స్థానాల్లో సాధించిన విజయాలు పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణకు నిదర్శనమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని నాయకులు ప్రశంసించారు. బీటీపీ పనులను ఎక్కడా వెనుకడుగు వేయకుండా శరవేగంగా కొనసాగిస్తున్నారని, 2028 మార్చి నాటికి పనులను పూర్తి చేసి రెండు నియోజకవర్గాలకు నీటిని అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. చాపిరి చెరువుకు కృష్ణా జలాలను తీసుకురావడంలో ఎమ్మెల్యే అమిలినేని కీలక పాత్ర పోషించారని అన్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న రవాణా ఇబ్బందులను గుర్తించి సుమారు 7,300 సైకిళ్లను పంపిణీ చేయడం ఆయన ప్రజా సంక్షేమ దృక్పథానికి నిదర్శనమని పేర్కొన్నారు. సొంత నిధులతో పాఠశాలలు, ఆలయాలకు సహాయం చేయడంతో పాటు బోర్లు వేయించడం, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రజలకు అండగా నిలుస్తున్నారని కొనియాడారు. సురేంద్రబాబు కానీ, ఆయనకు సంబంధించిన సంస్థలు కానీ అక్రమాలు, కబ్జాలకు పాల్పడే స్వభావం కలిగినవి కావని, సాధ్యమైనంత వరకు ప్రజలకు సహాయం చేయడమే తమ నాయకుడి లక్ష్యమని నాయకులు స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నికల సమయంలో మహిళలు, వృద్ధులను భయభ్రాంతులకు గురిచేసి నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని టీడీపీ నాయకులు విమర్శించారు. తమ నాయకుడు కూడా అదే విధంగా ఆలోచించి ఉంటే ప్రతిపక్షాలకు ఒక్క నామినేషన్ వేసే అవకాశం కూడా ఉండేది కాదని వ్యాఖ్యానించారు. అయితే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగి ప్రజల మద్దతుతోనే టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారని పేర్కొన్నారు. అనంతపురం టవర్ క్లాక్ బ్రిడ్జి నిర్మాణ పనులను గతంలో కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితుల్లోనూ ఎస్సార్సీ సంస్థ నిర్ణీత సమయంలో పూర్తి చేసిందని గుర్తుచేశారు. వైఎస్సార్సీపీలో ప్రస్తుతం మూడు ముక్కలాట నడుస్తోందని విమర్శించారు. రాబోయే 2029 ఎన్నికల్లోనూ అమిలినేని సురేంద్రబాబును అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. భారీ జనసందోహం, పసుపు జెండాల రెపరెపలు, కార్యకర్తల ఉత్సాహం మధ్య సాగిన విజయోత్సవ ర్యాలీ కళ్యాణదుర్గం పట్టణంలో రాజకీయ సందడిని నెలకొల్పింది.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ := బోయ రంగస్వామి.