|
|
by Suryaa Desk | Tue, Mar 10, 2026, 07:47 PM
పటాన్చెరు : జాతీయ రహదారి విస్తరణలో భాగంగా బిహెచ్ఎల్ చౌరస్తా నుండి రుద్రారం గ్రామ శివారు వరకు చేపడుతున్న పనుల్లో భూములు, ఇల్లు, దుకాణ సముదాయాలు నష్టపోయే ప్రతి ఒక్కరికి సంపూర్ణ న్యాయం చేస్తామని.. ఈ విషయంలో ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.జాతీయ రహదారి విస్తరణ పనుల పై శనివారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారం వార్డు కార్యాలయంలో గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ జాతీయ రహదారి విస్తరణలో రెండు వైపులా 100 ఫీట్ల చొప్పున రహదారి నిర్మాణం చేపడుతున్నారని.. ఇదే విధానం రుద్రారంలో అమలు అయితే ప్రజలు విలువైన ఆస్తులు కోల్పోయే దుర్భర పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రహదారి విస్తరణలో రుద్రాయ పరిధిలో మొత్తం 78 ఆస్తులకు విగాథం కలుగుతోందని తెలిపారు.ప్రజల విజ్ఞప్తి మేరకు 50 లేదా 60 ఫీట్ల వరకే రహదారి విస్తరణ పనులు చేపట్టాలని ఆయన సూచించారు. దీంతో పాటు రహదారి విస్తరణలో ఆస్తులు కోల్పోతున్న బాధితులకు మెరుగైన నష్టపరిహారంతో పాటు.. స్థలాలు కేటాయించాలని కోరారు. ఈ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రజలకు పరిహారం అందించేందుకు కృషి చేస్తామని జాతీయ రహదారుల సంస్థ ఈఈ ప్రకాష్ తెలిపారు. దీంతో పాటు ఆస్తులు కోల్పోతున్న బాధితులకు గ్రామంలో మరో చోట స్థలాలు కేటాయించేలా ప్రభుత్వానికి విన్నవిస్తామని ఆర్డీవో పాండు తెలిపారు. ఈ అంశంలో గ్రామస్తులు ఎటువంటి ఆందోళనకు గురికావద్దని ఎమ్మెల్యే జిఎంఆర్ భరోసా అందించారు. రహదారి విస్తరణల జాప్యం పైన ఎమ్మెల్యే ఆగ్రహం..జాతీయ రహదారి విస్తరణ పనులు ఆశించిన మేరకు జరగడం లేదని.. వివిధ శాఖల అధికారుల మధ్య సమన్వయ లోపం మూలంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కునే పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయని ఎమ్మెల్యే జిఎంఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్దేశించిన గడువు లోగా పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. స్థానిక అధికారుల సహకారం తీసుకోవడంతో పాటు.. ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీవో పాండు, ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ సుమలత. జాతీయ రహదారుల సంస్థ ఈఈ ప్రకాష్ డిఈ రామకృష్ణ, విద్యుత్ శాఖ డిఈ భాస్కరరావు, తాసిల్దార్ హరిబాబు, ఇస్నాపూర్ మున్సిపల్ కమిషనర్ వెంకట కిషన్, ట్రాఫిక్ సీఐ లాలు నాయక్, రుద్రారం కౌన్సిలర్లు పాండు, మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, మాజీ ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.