|
|
by Suryaa Desk | Wed, Sep 24, 2025, 08:10 AM
తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్తంభించింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది.హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం, వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 7.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. గంగా తీర ప్రాంతాలు, ఉత్తర ఒడిశా, వాయువ్య బంగాళాఖాతం నుంచి తెలంగాణ మీదుగా ఒడిశా వరకు ఒక ద్రోణి విస్తరించి ఉంది.ఈ నెల 25న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. 26న ఏపీ తీరాన్ని ఆనుకుని వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే నాలుగు రోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.