|
|
by Suryaa Desk | Sun, Sep 14, 2025, 03:15 PM
హైదరాబాద్ పాతబస్తీ మెట్రో ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే టెండర్లను పిలిచేందుకు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో రైలు మిలిటెడ్ సిద్ధమవుతోంది. మెట్రో అధికారులు నవంబర్ నాటికి అనుమతులు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ కసరత్తును ఇప్పటికే పూర్తి చేశారు. పాతబస్తీ మెట్రో మార్గం హైదరాబాద్‌లో మెట్రో విస్తరణలో ఒక కీలక భాగంగా మారనుంది. కొత్తగా ప్రతిపాదించిన ఈ మెట్రో మార్గం ఇప్పటికే ఉన్న కారిడార్లకు పొడిగింపు కావడంతో కేంద్రం కొన్ని కీలక అంశాలపై వివరణ కోరింది.
ముఖ్యంగా తొలి దశ మెట్రోను నిర్వహిస్తున్న ఎల్‌అండ్‌టీ హైదరాబాద్ మెట్రోతో టికెటింగ్, ఆదాయం, నిర్వహణ ఎలా పంచుకుంటారనే అంశంపై కేంద్రం ప్రశ్నలు లేవనెత్తింది. నిర్మాణం పూర్తయిన తర్వాత నిర్వహణ సమస్య కాదని అధికారులు తెలిపారు. ఇప్పుడున్న ఎల్‌అండ్‌టీకి నిర్వహణ బాధ్యతలు అప్పగించడమో, లేదా థర్డ్ పార్టీకి అప్పగించి ఆదాయాన్ని పంచుకోవడమో చేస్తామని వివరించారు. ఈ రెండు ఆప్షన్లలో రెండో దానికే ఎల్‌అండ్‌టీ మొగ్గు చూపుతోంది. ఒకవేళ స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి నిర్వహణ అప్పగించడానికి సిద్ధమని ఎల్‌అండ్‌టీ పేర్కొంది.
ప్రస్తుత ప్రభుత్వం రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి పాతబస్తీ మెట్రో ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అధికారుల అంచనా ప్రకారం ఈ పనుల పూర్తికి కనీసం రెండున్నరేళ్లు పట్టే అవకాశం ఉంది. సమయం తక్కువగా ఉండటం, పనులకు అవసరమైన 'రైట్ ఆఫ్ వే' (నిర్మాణానికి మార్గం) సిద్ధంగా ఉండటంతో టెండర్ల జారీకి అత్యవసరంగా చర్యలు తీసుకుంటున్నారు. కాగా, నష్టాల కారణంగా ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలని ఎల్‌అండ్‌టీ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. రద్దీకి తగ్గ కోచ్‌లు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని కేంద్రం వివరణ కోరింది. దీనిపై సంస్థ త్వరలో కొత్త కోచ్‌లను కొనుగోలు చేస్తామని బదులిచ్చింది. మెట్రో రైలు సంస్థ కేంద్రం అడిగిన అన్ని వివరణలు ఇచ్చామని దీపావళి తర్వాత ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒక శుభవార్త వినే అవకాశం ఉందని విశ్వాసం వ్యక్తం చేస్తోంది. పాతబస్తీ మెట్రో ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంత ప్రజల ప్రయాణ కష్టాలు చాలా వరకు తగ్గుతాయి.