|
|
by Suryaa Desk | Sun, Aug 24, 2025, 04:05 PM
తెలంగాణ ప్రభుత్వం 'మహాలక్ష్మి' పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ 'మహాలక్ష్మి' పథకం ఇప్పుడు కొత్త వివాదానికి కారణమవుతోంది. ఈ పథకం వల్ల తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆరోపిస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ఎదుట మహిళలు వినూత్నంగా ధర్నా చేశారు. ఈ పథకాన్ని ఎత్తివేసి.. ఎన్నికల్లో ఇచ్చిన మిగతా హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఉచిత ప్రయాణం వల్ల బస్సుల్లో విపరీతమైన రద్దీ పెరిగిందని, నిలబడటానికి కూడా స్థలం లేకుండా పోయిందని వారు వాపోయారు. అయితే వారి ప్రధాన సమస్య రద్దీ మాత్రమే కాదు. ఈ పథకం వల్ల తాము ఆర్టీసీ సిబ్బంది నుంచి ఎదుర్కొంటున్న అగౌరవంపై వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 'ఉచిత ప్రయాణం చేస్తున్నామన్న చులకన భావంతో కండక్టర్లు మమ్మల్ని నీచంగా చూస్తున్నారు. ఆడవాళ్లమనే మర్యాద కూడా లేకుండా అమర్యాదగా మాట్లాడుతున్నారు' అని ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎక్కడ కావాలంటే అక్కడ బస్సులు ఆపి ఎక్కించుకునేవారని, ఇప్పుడు మహిళలు కనిపిస్తే డ్రైవర్లు బస్సులను ఆపకుండా దూసుకుపోతున్నారని వారు ఆరోపించారు. డ్రైవర్లు తమను దుర్భాషలాడుతున్నారని, ఇది మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోందని అన్నారు.
ఈ పథకం వల్ల మహిళల మధ్య కూడా విభేదాలు పెరుగుతున్నాయని ధర్నాలో పాల్గొన్న మహిళలు తెలిపారు. బస్సులో సీటు కోసం, ఎక్కడానికి, దిగడానికి జరిగే తోపులాటల్లో మహిళలకు మహిళలే శత్రువులుగా మారి దాడులు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పథకం తమకు ప్రయాణ సౌలభ్యం కల్పించకపోగా.. ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని అంటున్నారు. ఫ్రీ బస్సు పథకానికి బదులుగా, ఎన్నికల్లో ఇచ్చిన ఇతర హామీలను ప్రభుత్వం అమలు చేయాలని వారు కోరారు. ముఖ్యంగా ప్రతి కుటుంబానికి రూ. 2500 ఆర్థిక సహాయం, యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి వంటి హామీలను అమలు చేస్తే తమకు మరింత ప్రయోజనం ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వం ఈ సమస్యలపై తక్షణమే స్పందించి మహిళలకు గౌరవప్రదమైన ప్రయాణాన్ని కల్పించాలని లేదా ఈ పథకాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా వల్ల కామారెడ్డిలో కొంత సమయం ట్రాఫిక్ అంతరాయం కలిగింది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సాధారణంగా ఫ్రీ బస్సు పథకాన్ని స్వాగతిస్తున్న మహిళలకు భిన్నంగా కామారెడ్డి మహిళల ఆవేదన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.