విద్యా రంగానికి ఆజాద్ సేవలు చిరస్మరణీయం
సూర్య - పెద్దపల్లి: దేశ విద్యా రంగానికి బలమైన పునాది వేసిన మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు అన్నారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రిగా ఆజాద్ అందించిన సేవలు చిరస్మరణీయమని, ఐఐటీ, యూజీసీ వంటి విద్యాసంస్థల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య అందించడమే ఆయన ఆశయమని, వాటి సాధనకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా మైనారిటీ అధికారి జి. రవికుమార్, కలెక్టరేట్ పరిపాలన అధికారి బి. ప్రకాష్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.