telangana
వాటర్ ప్లాంట్ వద్ద ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలి - జిల్లా కలెక్టర్ రాజర్షిషా
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : పట్టణంలోని 14వ వార్డు పరిధిలో ఉన్న టైలర్స్ కాలనీ, పోలీస్ కాలనీల్లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. స్థానికులతో ముఖాముఖి మాట్లాడి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలోని మినరల్ వాటర్ ప్లాంట్ వద్ద ఇంకుడు గుంతల నిర్మాణాలు, కాలనీలో డ్రైనేజీ వ్యవస్థను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మురుగునీటి కాలువలు సరిగా లేకపోవడంతో నీరు ఇళ్ల మధ్యలోనే నిలిచిపోతోందని ప్రజలు తెలపగా.. సమస్య శాశ్వత పరిష్కారానికి టీయూఎఫ్‌ఐడీసీ ద్వారా మొత్తం రూ. 2.80 కోట్ల నిధులు మంజూరైనట్లు వెల్లడించారు. 14వ వార్డులోని టైలర్స్ కాలనీ, పోలీస్ కాలనీల్లో సీసీ డ్రైన్లు, కల్వర్టుల నిర్మాణానికి రూ. 1 కోటి, అలాగే వార్డు పరిధిలో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, కల్వర్టుల నిర్మాణానికి మరో రూ. 1.80 కోట్లు మంజూరయ్యాయని ఆయన స్పష్టం చేశారు. టెండర్ ప్రక్రియ కారణంగా కొంత జాప్యం జరిగిందని, వెంటనే డ్రైనేజీ లెవెల్స్ సరిచూసుకుంటూ ఎక్కడా నీరు నిలవకుండా పకడ్బందీగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఇళ్ల నుంచి వచ్చే వృథా, మురుగు నీరు రోడ్లపైకి రాకుండా ప్రతి ఇంటి ఆవరణలో తప్పనిసరిగా ఇంకుడు గుంత నిర్మించుకోవాలని, దీనిద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. బోరు నీరు కలుషితమై రంగు మారుతోందని స్థానికులు తెలుపగా, వెంటనే మెకానిక్‌ల సాయంతో ఆ బోర్లను ఫ్లషింగ్ చేయించి శుభ్రం చేయించాలని సూచించారు.ఈ క్షేత్ర పరిశీలనలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, మావల తహసిల్దార్ వేణు, స్థానిక కౌన్సిలర్ వెంకటేష్, మున్సిపల్ ఇంజనీరింగ్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.