ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటం
• జి.ఓ. 190 అమలు చేయాలి.. సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి
• టిపియుఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వొడ్నాల రాజశేఖర్
సూర్య, మంచిర్యాల జిల్లా ప్రతినిధి :
ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టిపియుఎస్) రాష్ట్ర అధ్యక్షుడు వొడ్నాల రాజశేఖర్ డిమాండ్ చేశారు. శనివారం మంచిర్యాలలోని టిపియుఎస్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు బగ్గని రవికుమార్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయుల సంక్షేమం, ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసం సంఘం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయుల ప్రయోజనాల దృష్ట్యా జి.ఓ. నెం.190ను అమలు చేయాలని, కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సిపిఎస్)ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న కరువు భత్యాలను (డిఏ) వెంటనే విడుదల చేయడంతో పాటు పీఆర్సీని మంజూరు చేయాలన్నారు. పేద విద్యార్థుల విద్యాహక్కును కాపాడేందుకు, ప్రాథమిక పాఠశాలల మనుగడను దృష్టిలో ఉంచుకుని జి.ఓ. నెం.25ను సవరించాలని కోరారు.
అలాగే బోధనకు ఆటంకంగా మారుతున్న ఆన్‌లైన్ రిపోర్టింగ్ విధానాన్ని సరళీకరించాలని, అనవసర శిక్షణ కార్యక్రమాలను తగ్గించి ఉపాధ్యాయులపై పనిభారాన్ని తగ్గించాలని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు తమ సమయాన్ని పూర్తిగా విద్యార్థుల బోధనకే కేటాయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు బండి రమేష్, ఎస్. శ్రీనివాసరావు, ఐ. విద్యాసాగర్, జిల్లా నాయకులు చీర సమ్మయ్య, నీలేష్, శ్రీనివాస్‌తో పాటు జిల్లా, మండల కార్యవర్గ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు ఐక్యంగా, నిరంతర పోరాటం కొనసాగించాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.