సొసైటీల్లో మొదలుకాని ధాన్యం కొనుగోళ్లు
కొండాపూర్;ప్రభుత్వం సొసైటీల ద్వారా ధన్యం కొనుగోలు చేసేందుకు కేంద్రాలను ప్రారంభించి నెల రోజులు కావస్తున్నా ఇప్పటివరకు కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట కోసి ధాన్యాన్ని ఆరబెట్టి సంచుల్లో నింపి సొసైటీ కొనుగోలు కేంద్రాల వద్ద సిద్ధంగా ఉంచినా సేకరణ జరగడం లేదు. దీంతో రైతులు రోజుల తరబడి కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు.రైస్ మిల్లర్లకు ప్రభుత్వం విధించిన నిబంధనల కారణంగా ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. బ్యాంకుల్లో ఆస్తులు తనఖా పెట్టడం, మరో ఇద్దరు రైస్ మిల్లర్ల షూరిటీ ఇవ్వడం, క్వింటాల్ ధాన్యానికి 67 కిలోల బియ్యం అందించాలనే నిబంధనలతో మిల్లర్లు ధాన్యం తీసుకునేందుకు ముందుకు రావడం లేదని సమాచారం.ఇప్పటికే 15 నుంచి 20 రోజులుగా ధాన్యం కొనుగోళ్లు లేక కేంద్రాల వద్ద నిల్వలు పేరుకుపోతున్నాయి. ధాన్యం నిల్వ ఉండటంతో తరుగు పెరిగి రైతులకు ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. మరోవైపు గోదాముల వద్ద లారీలు నిలిచిపోవడంతో ధాన్యం తరలింపునకు ఆటంకం ఏర్పడుతోంది.ఆరుగాలం కష్టపడి, అప్పులు చేసి పంట పండించిన రైతులు చివరకు ధాన్యం విక్రయించుకోలేక ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే రైస్ మిల్లర్లతో చర్చించి సొసైటీల ద్వారా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.