శానిటేషన్ డ్రైవ్ లో పాల్గొన్న డిప్యూటీ కమిషనర్ లలితా శ్రావణి
జిన్నారం మేజర్ న్యూస్:పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్రజా ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని అమీన్ పూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ లలితా శ్రావణి సూచించారు. బొల్లారం డివిజన్ పరిధిలో శనివారం ఆమె పర్యటించి శానిటేషన్ డ్రైవ్‌లో భాగంగా పలు వార్డుల్లో చేపడుతున్న పారిశుద్ధ్య పనులను స్వయంగా పరిశీలించారు. క్షేత్రస్థాయిలో చెత్త సేకరణ, తరలింపు ప్రక్రియను పర్యవేక్షించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ.. వార్డుల్లో పారిశుద్ధ్య పనులను నిరంతరం కొనసాగించాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలని ఆదేశించారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి ప్రత్యేక చెత్త వాహనాల ద్వారా డంపింగ్ యార్డుకు తరలించాలని సూచించారు. రోడ్లు, వీధులు, ఖాళీ ప్రదేశాల్లో చెత్త పేరుకుపోకుండా చర్యలు తీసుకోవాలని, మురుగునీటి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని తెలిపారు. పారిశుద్ధ్య పనుల నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం వహించకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రతి వార్డులో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని పేర్కొన్నారు. ప్రజలు సైతం తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించి పారిశుద్ధ్య నిర్వహణకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ డబ్ల్యూ ఎం డీఈ వెంకటరమణ, శానిటరీ ఇన్‌స్పెక్టర్ వినోద్ కుమార్, పారిశుద్ధ్య కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.