సామాన్యులకు తక్కువ ధరలకే బియ్యం.. ప్రత్యేక విక్రయ కేంద్రం ప్రారంభం
సిద్దిపేట, మేజర్ న్యూస్ ప్రతినిధి : రోజురోజుకూ మార్కెట్లో బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సామాన్య ప్రజలకు తక్కువ ధరలకే నాణ్యమైన బియ్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో సిద్దిపేట పట్టణంలోని సమీకృత మార్కెట్‌లో ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.సోమవారం సమీకృత మార్కెట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాన్ని జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మారావు, జిల్లా తూనికలు, కొలతల అధికారి శివరంజని ప్రారంభించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. మార్కెట్లో బియ్యం ధరలు రోజురోజుకూ పెరుగుతున్నందున సాధారణ ప్రజలపై ఆర్థిక భారం పడకుండా తక్కువ ధరలకు బియ్యం అందించేందుకు రైస్ డిపో అసోసియేషన్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ నిర్దేశించిన ధరల కంటే తక్కువ ధరలకే బియ్యం విక్రయించేందుకు వ్యాపారులు అంగీకరించి, సిద్దిపేట సమీకృత మార్కెట్‌లో ప్రత్యేక విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు.ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తక్కువ ధరలకు బియ్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. సామాన్యులకు నిత్యావసర సరుకులు అందుబాటు ధరల్లో లభించేలా ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సహాయ పౌరసరఫరాల అధికారి సాయి రవి, బియ్యం వ్యాపారులు, తదితరులు పాల్గొన్నారు.